బురేవి తుపాన్‌ః తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. తొమ్మిది మంది మృతి

|

Updated on: Dec 05, 2020 | 2:07 PM

నివర్‌కు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్‌ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది.

బురేవి తుపాన్‌ః తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. తొమ్మిది మంది మృతి

నివర్ తుఫాను నుంచి కోలుకోకముందే బురేవి రూపంలో మరో తుఫాను తమిళనాడుపై విరుచుకు పడుతోంది. బురేవి తుఫాను మరోసారి తమిళవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 24 గంటలకు పైగా సముద్రంలో స్థిరంగా ఒకే చోట కదలకుండా ఉంది బురేవి. మరో 12 గంటలపాటు అదే చోట ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఈ తుపాన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, విల్లుపురం, తిరువణ్ణా మలై, అరియలూరు, పెరంబలూరు, వేలూరు, తిరువళ్లూరు, రాణిపేట, కారైకాల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2020 01:20 PM (IST)

    నీట మునిగిన కడలూర్‌ నటరాజ ఆలయం

    ఆ ప్రాంతంలో ఎన్నో తుఫాన్‌లు వచ్చాయి. కుండపోత వర్షాలు కురిశాయి. కానీ ఆ పురాతన దేవాలయం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. గుడిలోకి వర్షపునీరు చేరలేదు. అయితే తాజాగా బురేవి సృష్టించిన తుఫాన్‌ అంతా ఇంతా కాదు. ఏకంగా చిదంబరం నటరాజ స్వామి ఆలయమే జలదిగ్బంధంలో చిక్కుకుంది.

    తమిళనాడులోని కడలూరుజిల్లాలోని చిదంబరంలో భారీ వర్షం కురిసింది. కేవలం 24 గంటల్లో 32 సెంటిమీటర్ల వర్షం పాతం నమోదైంది. దాంతో ఆలయంతోపాటు పరిసరప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. 1997 తర్వాత అంటే దాదాపు 43 ఏళ్ల అనంతరం తొలిసారిగా ఆలయంలోకి నడుముల్లోతు నీళ్లు చేరాయి. దీంతో భక్తుల దర్శనాలు నిలిపివేశారు ఆలయ అధికారులు.

    చిదంబరం ఆలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. కడలూర్‌జిల్లాలో ఉన్న ఈ ఆలయం చిదంబరం నడిబొడ్డున 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే గుర్తుకు వస్తుంది.

    1977 దివిసీమ ఉప్పెన సమయంలోనే..తమిళనాట తుఫాన్‌ బీభత్సానికి చిదంబరం ఆలయంలోకి కూడా వర్షపునీరు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే గుడిలోకి నడుములోతు నీళ్లు వచ్చాయ్‌. అయినా అక్కడి పూజారులు నిత్యపూజలు ఆపలేదు. భక్తులకు మాత్రం దర్శనం నిలిపివేశారు. చక్కని శిల్పకళతో ఉట్టిపడే ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు నెలువైందని అంటారు. అందుకే ప్రతి అంగుళం కూడా చిదంబర రహస్యాన్ని సూచిస్తుందని పురణాలు చెబుతున్నాయి.

  • 05 Dec 2020 01:05 PM (IST)

    ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో విల్లుపురం జిల్లాలోని టిండివనం బ్లాక్‌లోని వీదూర్ డ్యామ్ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 32 అడుగుల గరిష్ఠ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో 31.6 అడుగులకు చేరుకుంది. దీంతో శనివారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 405 క్యూసెక్కుల నీటి ప్రవాహాం వచ్చి చేరుతుందని ప్రజా పనుల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆనకట్ట విల్లుపురం జిల్లాలో సుమారు 2,200 ఎకరాలకు, పొరుగున ఉన్న పుదుచ్చేరిలో 1,000 ఎకరాలకు సాగునీరు ఇస్తుంది.

  • 05 Dec 2020 12:49 PM (IST)

    వరద ప్రభావ ప్రాంతాల్లో తమిళనాడు సీఎస్ గగన్‌దీప్ సింగ్ బేడి పర్యటన

    కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అధికారిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం, ఉద్యాన పంటలతో సహా సుమారు 39,000 హెక్టార్ల పంట భూమి వర్షపు నీటిలో మునిగిపోయింది. వరద పరిస్థితులను ఎదుర్కొన్న ప్రాంతాల నుండి అనేక కుటుంబాలను తరలించారు. వరద ప్రభావం తగ్గ్గిన తర్వాతే పంట నష్టం ఎంతవరకు తెలుస్తుందో ఒక అధికారి తెలిపారు.

    వరద ప్రభావ ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడి పర్యటించారు. వర్షంలో పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రకాల పరిహారం లభిస్తుందని సీఎస్ తెలిపారు. తమ పంటలకు బీమా తీసుకోని రైతులకు కూడా రెవెన్యూ శాఖ నుంచి నష్టపరిహారం లభిస్తుందన్నారు. అయితే పంట నష్టం 33% కన్నా ఎక్కువ ఉంటే రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి అందుతుందన్నారు.

  • 05 Dec 2020 12:42 PM (IST)

    నీటి మునిగిన రామేశ్వరం

    తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీరప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రామేశ్వరంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నటరాజపురం ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అధికారులు.. ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  • 05 Dec 2020 12:30 PM (IST)

    నీట మునిగిన పుదుచ్చేరి

    బురేవి తుఫాను ప్రభావంతో పుదుచ్చేరి పూర్తిగా నీట మునిగింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్లు ప్రాంతాలు నీటమునిగాయి. పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాల జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాటర్లాగింగ్, రెయిన్‌బోనగర్ ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

  • 05 Dec 2020 12:26 PM (IST)

    భారీ వర్షానికి దెబ్బతిన్న ఆలయాలు

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అల్లాడిపోతుంది. భారీ వరదలకు జనజీవనం స్తంభించింది. అటు రామేశ్వరం సమీపంలోని ధనుష్‌కొడి ఆలయం భారీ వర్షానికి దెబ్బతిన్నది. మరోవైపు, బలమైన గాలుల కారణంగా శిధిలమైన చర్చి భవనం గోడ కూలిపోయింది.

  • 05 Dec 2020 12:07 PM (IST)

    తమిళనాట వదలని భారీ వర్షాలు.. ప్రాణాలను కోల్పోయిన 9 మంది

    బురేవి తుపాన్‌ ప్రభావంతో తమిళనాడులో కురిసిన భారీ వర్షాలు తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. మైలాడుదురై జిల్లాకు చెందిన శరత్‌ కుమార్‌ (31) శుక్రవారం తెల్లవారుజామున రోడ్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా విద్యుత్‌ తీగను తగిలి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఆరుంగాల్‌ గ్రామానికి చెందిన శివభాగ్యం (60) సైతం విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. తంజావూరు జిల్లా వడకాల్‌ చక్కర గ్రామానికి చెందిన శారదాంబాల్‌ (70) ఇంటి ప్రహరీ గోడ కూలడంతో శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. కుంభకోణం సమీపంలోని ఎలుమిచ్చకాయ్‌ గ్రామానికి చెందిన కుప్పుస్వామి (70), ఆయన భార్య యశోద (65)పై ఇల్లు పైకప్పు కూలడంతో మరణించినట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    కడలూరుకు జిల్లాకు చెందిన సంజన (10) అనే చిన్నారి గోడ కూలి మృతిచెందింది. పెరియకాట్టు పాళయం గ్రామానికి చెందిన ధనమైయిల్‌ (55) సైతం ఇంటి గోడ కూలడంతో మృతిచెందారు. చెన్నై నగరంలోని తండయారుపేటకు చెందిన కార్మికుడు సురేష్‌ (38) విధులకు రోడ్డులో నడిచి వెళుతుండగా తెగిన విద్యుత్‌ తీగపై కాలు వేసి కరెంటు షాక్‌కు గురై కన్నుమూశాడు. చెన్నై అడయారు చెరువులో వరద నీటిలో కొట్టుకొస్తున్న గుర్తుతెలియని పురుషుని శవాన్ని స్థానికులు గుర్తించారు. చెరువులో వరద ప్రవాహం వేగంగా ఉండడంతో శవాన్ని ఒడ్డుకు చేర్చే ధైర్యం చేయలేకపోయారు. కడలూరు జిల్లాలోని చిదంబరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నటరాజస్వామి ఆలయం ప్రాకారం మొత్తం నీట మునిగింది. 1977కు తర్వాత అంటే 43 ఏళ్ల తర్వాత ఆలయంలో నడుము లోతు నీళ్లు చేరాయని స్థానికులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం చిగురుటాకులా వణికిపోతున్నారు.

    నేడు కేంద్ర బృందం రాక.. మరోవైపు నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించనుంది కేంద్ర బృందం. నష్టాలను అంచనా వేయబోతోంది. తొలి రోజున కడలూరు, విల్లుపురం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఇక బురేవి తుఫాన్‌ దిశ మారితే ఏపీపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా..చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • 05 Dec 2020 11:37 AM (IST)

    మరోసారి జలదిగ్బంధంలో చెన్నై నగరం

    నిన్న మొన్నటి వరకు నివర్ తుఫాన్‌తో విలవిలలాడిన చెన్నై నగరం.. బురేవి తుపాన్‌తో వణికిపోతుంది. చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. చెన్నై వరద నీటితో చెరువులా మారిపోయింది. చెన్నై శివారు ప్రాంతాలైన తాంబరం సహా అనేక ప్రాంతాల్లోని లోతట్లు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నివర్‌ తుపాను కారణంగా ప్రవహించిన నీటి నుంచి బయటపడకముందే బురేవి వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చెన్నై శివార్లలోని ముడిచ్చూర్‌ ప్రాంతంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చెన్నైలోని అడయారు, రాయపేట, మైలాపూర్, ఎగ్మూర్, పురసైవాక్కం, గిండి, సైదాపేట ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.

    రెండు వారాలుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలకు చెన్నై, శివారు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. రోడ్లపై భారీగా చేరిన వరదనీటితో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సు డిపోలు నీట మునగడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. తుపాను ప్రభావంతో చెన్నైలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందంటున్నారు వాతావరణశాఖాధికారులు.

  • 05 Dec 2020 11:23 AM (IST)

    కడలూరులో భారీ వర్షాలు.. చిదంబరం ఆలయంలోకి వరద నీరు

    బురేవీ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జనజీవనం స్తంభించింది. తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, నాగపట్నం, కారైక్కాల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, సముద్రతీర ప్రాంతాలు భారీ వర్షాలను చవిచూశాయి. రామనాథపురం, తూత్తుకుడి జిల్లాల వద్ద సముద్ర తీరానికి సమీపం మన్నార్‌వలైగూడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. బురేవి ప్రభావం వల్ల రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరులో 34 సెంటీ మీటర్ల వర్షం పడడంతో చిదంబరం ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. తూత్తుకుడి, మదురై, కొచ్చికి చెన్నై నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు భారీ వర్షాల కారణంగా రద్దయ్యాయని అధికారులు ప్రకటించారు.

  • 05 Dec 2020 11:20 AM (IST)

    రామనాథపురం తీరానికి సమీపంలో తుపాను కేంద్రీకృతం..

    నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతం ఈశాన్యంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత బురేవి తుపానుగా రూపాంతరం చెంది శ్రీలంక వైపునకు పయనిస్తోంది. గురువారం మధ్యాహ్నం శ్రీలంకను దాటి పాంబన్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై తుపాన్, కన్యాకుమారి మీదుగా తమిళనాడులో తీరం దాటుతుందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనావేసింది. గురువారం రాత్రే తుపాన్‌ బలపడడం ప్రారంభంకావడంతో రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున రామనాథపురం సముద్ర తీరానికి సమీపంలో బురేవి తుపాను కేంద్రీకృతమైంది. ఈ కారణంగా కన్యాకుమారి జిల్లాకు ఈశాన్యం ప్రాంతంలో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

Published On - Dec 05,2020 1:20 PM

Follow us
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.