అమరావతి నిర్మాణంపై ఏపీ ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు

Buggana Rajendranath Reddy sensational comments on AP Capital Amaravati, అమరావతి నిర్మాణంపై ఏపీ ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓ వైపు ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించాలని విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రులైతే అప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు గానీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట కూడా పలకలేదు. దీంతో అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజధాని నిర్మాణంపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు లేవని బుగ్గన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే తాము దృష్టి సారించినట్లు తెలిపారు.

భారత్- సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఏపీ తరఫున హాజరైన ఆయన అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కేవలం వంద రోజుల పాలనే పూర్తి చేసుకుందని.. అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితం అవుతున్నాయని బుగ్గన అన్నారు. అమరావతిని తాము విస్మరించలేదని.. దాని నిర్ణయానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధిని వికేంద్రీకరించడంపైనే దృష్టి సారించామని తెలిపారు. అందరికి సుస్థిర జీవనం, ఉత్పాదక రంగాన్ని అన్నిచోట్ల అభివృద్ధి చేయడం, అందుకు అవసరమైన మౌలిక సదుపాలయాలు కల్పించడం వంటి కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో పరిశ్రమలు పెంచుకోవడంపై దృష్టి సారించామని బుగ్గన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *