బీజీ-3 పత్తితో జీవ వైవిధ్యానికి హాని : వద్దంటున్న రాష్ట్రాలు

bt cotton threat, బీజీ-3 పత్తితో జీవ వైవిధ్యానికి హాని : వద్దంటున్న రాష్ట్రాలు

విత్తనం దశ నుంచే అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల్లోనే నాసిరకం, నాణ్యత తక్కువగా ఉంటోంది. ఫలితంగా ఆధునిక రకాల వంగడాల వైపు రైతు దృష్టి సారిస్తున్నాడు. అదే కొంపలు ముంచుతోంది. రైతులకే కాదు..జీవ వైవిధ్యానికి శాపంగా మారుతోంది.

దేశంలో ఏటా 1.70 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు ఉంటోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లతో పాటు..తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పత్తి సాగవుతోంది. తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తుండగా…ఆంధ్రప్రదేశ్ లో పత్తిసాగు 25 లక్షల ఎకరాలు పైనే ఉంటోంది. పోయినేడు పత్తికి ధర బాగా పలకడమే విస్తీర్ణం పెరిగింది. ఇందులో బీటీ పత్తి విత్తనాలనే 95 శాతం రైతులు వేస్తున్నారు. ఫలితంగా 40 రోజులు దాటాక ఆకు తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు పంటలను ఆశించి ఇబ్బంది పెట్టింది. వాటి నివారణకు ఎక్కువగా పురుగు మందులను వాడాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చు పెరుగుతోంది. ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెడుతున్నారు రైతు. కౌలు రైతు అదనంగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రాంతం, నీటి అవసరాలు, సేద్యం తీరును బట్టి కౌలు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.

బీటీ అంటే ఏమిటి…

బీటీ అంటే బాసిల్లం తురింజెనెసిస్. ఇదొక బ్యాక్టీరియా. చీడ పీడలను తట్టుకునే మేలు రకమైన వంగడంగా భావిస్తారు. అమెరికా ఈ విత్తనాన్ని అభివృద్ధి చేసి భారత్ లోకి బలవంతంగా ప్రవేశ పెట్టింది. అమెరికాలోని మోనోశాంటో కంపెనీ మహారాష్ట్రలోని మహికో బయోటెక్ తో ఒప్పందం చేసుకుంది. 2002లో ఒప్పందం జరగింది. ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించింది. ఒక దశలో బీటీ పత్తిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ ఆ పని చేయలేకపోతున్నాయి రాష్ట్రాలు. ఇప్పుడు బీటీ1, బీటీ2 (బోల్ గార్డ్ ) విత్తనాలు ఇప్పుడు విరివిగా వాడారు రైతులు. దేశీయ రకాలు రైతుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. చీడపీడలను తట్టుకునే శక్తి బీటీకి ఉందని ప్రచారం జరగడమే ఇందుకు కారణం. అందుకే రైతులు వాటి వైపు మొగ్గు చూపారు. నెలన్నర వరకు పెద్దగా పంటకు ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పత్తి 150 నుంచి 180 రోజుల్లో కాపు పూర్తవుతున్నా…పెట్టుబడి పెరగడం ఆందోళన కలిగించే అంశమే. దేశీయంగా నరసింహా వంటి ఆధునిక పత్తి వంగడాలను సృష్టించినా ఇంకా రైతులకు పెద్దగా అందుబాటులో లేవు. ఫలితంగా బీటీ విత్తనాల వైపు రైతులు దృష్టి సారించారు. బీటీ పత్తి విత్తనాల వాడకం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది. రైతులు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటోంది. గర్భిణీలు ఇబ్బందని పరిశోధనలు తేల్చాయి. తాజాగా వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయం పై లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.

bt cotton threat, బీజీ-3 పత్తితో జీవ వైవిధ్యానికి హాని : వద్దంటున్న రాష్ట్రాలు

ప్రభుత్వ అనుమతి లేకుండా బోల్‌గార్డ్‌ (బిజి)- 3 పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. మోన్‌శాంటో రాయల్టీ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం తిరిగాయి. ఫలితంగా పదేళ్ల నుంచి బీటీ విత్తనాల ధర తగ్గింది. బీటీ పత్తి కూడా గులాబీరంగు లద్దె పురుగును అదుపు చేయలేకపోతోంది. దీంతో విత్తనాల్లో సామర్థ్యం తగ్గిందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. మోన్‌శాంటో శాస్త్రవేత్తలు బిజి-3 పేరుతో కొత్త రకం విత్తనాన్ని సృష్టించారు. ఈ ఏడాది బిజి-3 విత్తనాలను మార్కెట్‌లోకి విచ్చలవిడిగా ప్రవేశపెట్టారు. కలుపు మందు చల్లినా పత్తి మొక్కలు చనిపోవని ప్రచారం చేశారు. ఈ విత్తనానికి మంచి గిరాకీ ఏర్పడింది. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్‌ను రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు కొనుగోలు చేశారు.

బిజి -3పైనే అందరి చూపు

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని రైతులు ఆశిస్తారు. తాను పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వస్తుందనే అంచనా వేస్తారు. రైతు బలహీనతలను దృష్టిలో ఉంచుకుని బిజి-3ని మార్కెట్‌లోకి దశల వారీగా పంపారు. ఒడిశా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బిజి-3 పత్తిని బాగా పండిస్తున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో బిజి-3ని సాగు చేశారు. బిజి-3 కి సంబంధించిన పంట కర్నూలుతో పాటు కర్నాటకలోని బళ్లారి, రాయచూరు, సింధనూరు, సిరిగుప్ప, ధవనగిరి, గాంధీనగర్‌, హోస్‌పేట తదితర ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఈ పత్తిని పండిస్తున్నారు. అక్కడ పండిన పత్తిని గుంటూరు జిన్నింగ్‌ మిల్లులకు అమ్ముతున్నట్లు చూపిస్తున్నారు. గుంటూరులోనే వివిధ రకాల పేర్లతో బిజి-3 పత్తి విత్తనాలను ప్యాక్‌ చేసి మార్కెట్‌ లోకి విడుదల చేస్తున్నారు.

అమెరికా, ఇతర దేశాల్లో బిజి-3 విత్తనాల పై నిషేధం ఉంది. అక్కడ నిషేధించిన ఫార్ములాను మోన్‌శాంటో కంపెనీ మన దేశంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి రైతులను మోసం చేస్తోంది. బిజి-3 పత్తి విత్తనాలు భూమి ఆరోగ్యానికి హాని చేస్తుందని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ఏరువాక జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ధూళిపాళ్ల రామ్‌ప్రసాద్‌ తదితరులు చెప్పే మాట. బహుళజాతి సంస్థల బాగోతాలను చూసీచూడనట్లుగా వ్యవహరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నచందాన ఇప్పుడు ఆలోచన చేస్తోంది. జీవ వైవిధ్యానికి పూడ్చలేని నష్టం జరుగుతుందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారనుంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోందని వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.bt cotton threat, బీజీ-3 పత్తితో జీవ వైవిధ్యానికి హాని : వద్దంటున్న రాష్ట్రాలు

బీజీ పత్తి పండించే ప్రాంతాల్లో అనుమతిలేని చట్ట వ్యతిరేక జన్యుమార్పిడి కలిగిన కొన్ని రకాల బీజీ–3 పత్తి రకాలు విత్తనోత్పత్తి సమయంలో సహజంగా కలుషితమయ్యాయి. కలుపునాశిని, పురుగులను తట్టుకునే కారకాలు గల జన్యుమార్పిడి పత్తివిత్తనాలను అనుమతి లేకుండా అమ్ముతున్నాయి. జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కేంద్రం అనుమతి లేకుండా అమ్ముతున్న విషయాన్ని పరిశీలించింది. అనుమతిలేని బీజీ–3 విత్తనాల క్రమబద్ధీకరణ, పేటెంట్‌ హక్కులు తదితర అంశాలపై అదనపు అడ్వకేట్‌ జనరల్‌ నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించాయి.

దేశీయ విత్తనాల వైపు చూపు…

దేశీయంగా తయారయ్యే విత్తనాలు అందుబాటులోకి వస్తే కంపెనీల గుత్తాధిపత్యానికి కళ్లెం పడుతోంది. అప్పుడే పత్తి విత్తనంలో ఒక విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రయోగాత్మకంగా పంజాబ్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ఈ విత్తనాల ద్వారా పంట పండించి మంచి ఫలితాలు సాధించారని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధారణ రకాల్లోనే బీటీ టెక్నాలజీని ఉపయోగించి ఈ విత్తనాలను తయారు చేసింది. దీనివల్ల ఈ విత్తనం వేసిన రైతు పంట పండాక తిరిగి దాన్నే విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే విత్తనం తక్కువ ధరకు లభించడంతోపాటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం బోల్‌గార్డ్‌ (బీజీ)–1 పత్తి విత్తన ధర రూ.635గా.. బీజీ–2 విత్తన ధర రూ.800గా ఉంది. అయితే పంజాబ్‌ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తన వెరైటీ ఆ ధరలో సగానికే లభించనుంది. పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ నిపుణులు తయారు చేసిన పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.

-కొండవీటి శివనాగరాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *