కమలాకర్షణలో మళ్ళీ పవన్..ఆ మాటల మీనింగ్ అదేనా ?

2014 సీన్‌ రిపీట్‌ అవుతుందా? పవన్‌ కల్యాణ్‌ నోట ఢిల్లీ మాట ఎందుకు వినిపించింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ పవన్‌ దారెటు? ఆదివారం జరిగిన విశాఖ లాంగ్ మార్చ్‌లో పవన్ కల్యాణ్ మాటలను లోతుగా అర్థం చేసుకుంటే జరగబోయేది ఇదేనన్న డౌట్ రాకమానదు. మొదట్నించి బిజెపి పట్ల సాఫ్ట్ కార్నర్ వున్న పవన్ కల్యాన్ మరోసారి బిజెపి నేతలను కలుస్తానని, ఢిల్లీ పెద్దలకు జగన్ పరిపాలనా వైఫల్యాలను వివరిస్తానని ప్రకటించారు. […]

కమలాకర్షణలో మళ్ళీ పవన్..ఆ మాటల మీనింగ్ అదేనా ?
Rajesh Sharma

|

Nov 04, 2019 | 7:43 PM

2014 సీన్‌ రిపీట్‌ అవుతుందా? పవన్‌ కల్యాణ్‌ నోట ఢిల్లీ మాట ఎందుకు వినిపించింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ పవన్‌ దారెటు? ఆదివారం జరిగిన విశాఖ లాంగ్ మార్చ్‌లో పవన్ కల్యాణ్ మాటలను లోతుగా అర్థం చేసుకుంటే జరగబోయేది ఇదేనన్న డౌట్ రాకమానదు. మొదట్నించి బిజెపి పట్ల సాఫ్ట్ కార్నర్ వున్న పవన్ కల్యాన్ మరోసారి బిజెపి నేతలను కలుస్తానని, ఢిల్లీ పెద్దలకు జగన్ పరిపాలనా వైఫల్యాలను వివరిస్తానని ప్రకటించారు.
2014లో బిజెపి, టిడిపిలకు అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత అయిదేళ్ళ పరిణామ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ బిజెపికి వ్యతిరేకంగా గళమెత్తారు. అయితే.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారంటూ బిజెపి నేతలు ఘాటుగా స్పందించారు. అయితే ఏపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా, నరేంద్ర మోదీ చంద్రబాబును విమర్శించారు కానీ పవన్ కల్యాణ్‌ని పల్లెత్తు మాట అనలేదు.
భవిష్యత్తులో పవన్ కల్యాణ్‌కు డోర్స్ ఓపెన్ వుంచాలన్న దూర దృష్టితోనే బిజెపి నేతలు జాగ్రత్తగా మాట్లాడి వుంటారని అప్పట్లో భావించారు. ఇపుడు పరిస్థితి చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ కేంద్రంపై సుతిమెత్తని విమర్శలు చేస్తూనే కొన్ని అంశాలలో మోదీ సర్కార్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌ సభలో పవన్‌ చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా అయ్యాయి. పవన్‌ ఎందుకు ఇలా మాట్లాడారు? బీజేపీకి మళ్లీ దగ్గరవుతారా? లేక ఆపార్టీతో దోస్తీ కోరుకుంటున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ దేశాన్ని పాలించే బలమైన వ్యక్తులు తనకు తెలుసని పవన్ చెప్పారు. బీజేపీ పెద్దలకు తనంటే ఇష్టమనేలా జనసేనాని కామెంట్స్‌పై చేశారు. ఇసుక సమస్యపై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానన్నారు. తాను బీజేపీతో కలిసేందుకు రెడీ  అని ఈమాటల ద్వారా సిగ్నల్స్‌ పంపారా? అనే చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ,బీజేపీని మరోసారి కలిపేందుకు పవన్‌ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్‌ చేసి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ పట్ల సానుకూలంగా పవన్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాజధానిలో పర్యటించిన అనంతరం.. పవన్ మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలను కలుస్తానన్నారు. అంతకు ముందు అమెరికాలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్‌ను కలిశారు. దీంతో పవన్ బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ బీజేపీతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు పంపారని భావిస్తున్నారు.
2014లో బీజేపీ,టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలకు జనసేన మద్దతు పలికింది. దీంతో అప్పట్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఓటు బ్యాంక్‌ దెబ్బతినడమే కాకుండా…అధికారానికి దూరమయ్యాయి. దీంతో బీజేపీ,టీడీపీతో కలిసి నడిచి 2014ను రిపీట్‌ చేయాలని జనసేనాని భావిస్తున్నారా? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu