Indo-China tension: రైఫిళ్ళు కాకుండా మారణాయుధాల వినియోగం.. రీజన్ ఇదే!

ఇరు వైపులా ప్రాణనష్టం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అయితే.. రైఫిళ్ళు కాకుండా దారుణంగా కొట్టి చంపేలా సైనికులు స్వయంగా తయారు చేసుకున్న దారుణ మారణాయుధాలనెందుకు ఈ ఘర్షణలో వాడారు? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Indo-China tension: రైఫిళ్ళు కాకుండా మారణాయుధాల వినియోగం.. రీజన్ ఇదే!
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Jun 19, 2020 | 2:25 PM

గత నాలుగు రోజులుగా దేశంలో ఎక్కడ విన్నా ఇండో-చైనా సరిహద్దులో నెలకొన్ని ఉద్రిక్తత గురించి, అక్కడ మరణించిన భారత సైనికుల గురించే చెప్పుకుంటున్నారు. అత్యంత భారీ సంఖ్యలో సైనిక సంపత్తి కలిగిన రెండు దేశాల సైనికులు అత్యంత ఆధునిక రైఫిళ్ళు, మోర్టర్లు కలిగి వున్నా కూడా ఆదిమానవుల కాలాన్ని తలపించేలా దారుణ మారణాయుధాలనెందుకు వాడారు ? ఈ ప్రశ్న ఇపుడు చాలా మందిని వేధిస్తోంది. ఒక్క బుల్లెట్ పేలలేదు. కానీ ఇరు వైపులా పదుల సంఖ్యలో సైనికులు మరణించారు.

ముందుగా మన దేశానికి చెందిన 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చినా.. ఆ తర్వాత చైనాకు చెందిన 30 మంది కూడా మరణించారని కొన్ని మీడియా సంస్థలు… 43 మంది మరణించారని మరికొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మొత్తమ్మీద ఇరు వైపులా ప్రాణనష్టం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అయితే.. రైఫిళ్ళు కాకుండా దారుణంగా కొట్టి చంపేలా సైనికులు స్వయంగా తయారు చేసుకున్న దారుణ మారణాయుధాలనెందుకు ఈ ఘర్షణలో వాడారు? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

గత 45 ఏళ్ళు ఇరు దేశాల మధ్య పలు మార్లు ఉద్రిక్తత ఏర్పడినా ప్రాణనష్టం మాత్రం జరగలేదు. 1975 నుంచి ఇరు దేశాలు ఆయుధాలను వినియోగించడంలో సంయమనం పాటిస్తూనే వున్నాయి. ఈ మధ్య కాలంలో 1996లో ఒకసారి, 2005 మరోసారి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఆయుధాలను వినియోగించ కూడదని, వాస్తవాధీన రేఖ (ఎల్.ఏ.సీ)కి రెండు కిలో మీటర్ల దూరంలో సైనిక చర్యలు వుండకూడదని రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్, చైనా రెండు దేశాలు అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలే. ఎవరు దుందుడుకుగా వ్యవహరించినా అది యుద్ధానికి దారి తీసే పరిస్థితిలే తలెత్తుగతాయి. అందుకే పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా శాంతికి బీజం వేయాలని భావించాయి గత కాలపు ఇరు దేశాల ప్రభుత్వాలు.

తాజాగా వస్తున్న కథనాల ప్రకారం జూన్ 15న జరిగిన ఘర్షణలో చైనా సైనికులు కర్రలకు ఇనుప మేకులు గుదిగుచ్చి కట్టిన మారణాయుధాలను వినియోగించి భారత సైనికులపై దాడికి దిగారు. అనుకోని దాడికి ఉలిక్కి పడిన భారత సైనికులు తేరుకుని ఎదురు దాడికి దిగేలోపే పెద్ద నష్టం జరిగిపోయింది. మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తు ఓ కమాండింగ్ ఆఫీసర్ (కల్నల్ సంతోష్ బాబు) కూడా ఈ దాడిలో మరణించారు. చైనా సైనికులు జరిపిన దాడిలో రాళ్ళను కూడా వినియోగించారని సమాచారం. చైనా దాడిని ఊహించని భారత్ ఆర్మీ.. ఆ తర్వాత తేరుకుని ఎదురు దాడికి దిగింది. ఫలితంగా చైనా సైనికులు 30 మంది లేదా 43 మంది మరణించారని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ చైనా ఇంత వరకు మరణించిన తమవారి వివరాలను వెల్లడించలేదు కాబట్టి అటువైపు ప్రాణనష్టం జరిగిందని గట్టిగా చెప్పలేం.

అయితే, చైనా సైనికులు తమ వద్ద ఉన్న రైఫిళ్ళు, మోర్టర్లతో కాకుండా చేతితో తాము తయారు చేసుకున్న దారుణ మారణాయుధాలనే ఎందుకు వినియోగించారు అంటే దానికి పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ హప్పీమూన్ జాకబ్ వంటి వారు దీనికి ఆలోచించాల్సిన విశ్లేషణను అందిస్తున్నారు. పిడి గుద్దులతోను, చేతితో తయారు చేసిన ఆయుధాలతోను సైనికులు పరస్పరం దాడికి దిగితే దానిని దేశాల మధ్య యుద్దంలా కాకుండా అప్పటికప్పుడు సైనిక బలగాల మధ్య రగిలిన కోపావేశాలుగానే దేశాలు పరిగణిస్తాయి. అలా యావత్ ప్రపంచం భావించాలన్న వ్యూహంతోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చైనా సైనికులు దాడికి దిగినట్లు జాకబ్ విశ్లేషిస్తున్నారు. రైఫిళ్ళు, మోర్టర్లతో గనక దాడులకు దిగితే అది పై అధికారుల ఆదేశాలతోనే జరిగినట్లు భావించి, యుద్ద వాతావరణం ఏర్పడుతుందన్నది జాకబ్ విశ్లేషణ.

1996లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కాల్పులు జరపడం, బయో-డీగ్రేడేషన్‌కు కారణమవడం, హానికరమైన రసాయనాలను వినియోగించడం, పేలుళ్ళకు గానీ, వేటకు గానీ పేలుడు పదార్థాలను వినియోగించడం గానీ ఇరు దేశాలు చేయకూడదు. కానీ గత మే 5వ తేదీ నుంచి ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతూనే వుంది. మే 9, 12, 18వ తేదీల్లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటి మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. మే 26వ తేదీన ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ జరిగినట్లు కథనాలు వచ్చాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతు పలుమార్లు ఏర్పడినా.. ఇలాంటి ఉదంతాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు గతంలో నార్దర్న్ ఆర్మీ కమాండ్‌లో విధులు నిర్వహించిన లెఫ్టినెంట్ జనరల్ దీపేంద్ర సింగ్ హూడా. 2017 డోక్లాం స్టాండాఫ్ సందర్భంగా కూడా ఇలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన గుర్తు చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu