బ్రహ్మోస్ క్షిప‌ణి ప్రయోగం విజయవంతం… 300 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిన క్షిప‌ణి

భారత రక్షణ రంగ అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిప‌ణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. బ్రహ్మోస్ క్షిప‌ణి 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది.

  • Balaraju Goud
  • Publish Date - 10:00 pm, Wed, 25 November 20

భారత రక్షణ రంగ అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిప‌ణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఈ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ ను భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్ క్షిప‌ణి 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించి దాయాది దేశాలకు సవాలు విసిరింది.

శబ్ధానికి కంటే మూడు రెట్లు వేగంగా…

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ శబ్ధ వేగానికి కంటే మూడు రెట్లు వేగంతో దూసుకెళ్తుందని శాస్ర్తవేత్తలు తెలిపారు. గతంతో బ్రహ్మోస్ 290 కిలో మీటర్ల లక్ష్యాన్ని చేరుకునేలా రూపొందించామని, ప్రస్తుతం 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను రీచ్ అయిందని, రానున్న రోజుల్లో 450 కిలో మీటర్ల లక్ష్యాన్నిచేరుకునేలా అభివృద్ధి చేయనున్నట్లు శాస్ర్తవేత్తలు తెలిపారు.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ మొదటి దశ ప్రయోగాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా, బుధవారం బ్రహ్మోస్ మిస్సైల్ ను రెండు వేరు వేరు దిశల నుంచి వేరు వేరు టార్గెట్లను ఛేదించేలా ప్రయోగించారు. ఆ రెండు కూడా విజయవంతం అయ్యాయని తెలిపారు. ఈ క్షిప‌ణిని త్వరలో వార్ షిప్స్ నుంచి ప్రయోగించేలా కూడా అభివృద్ధి చేయనున్నారు.

800 కిలో మీటర్ల లక్ష్యాన్నిఛేదించేలా…

ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్ 450 కిలో మీటర్ల లక్ష్యాన్నినాలుగు సార్లు విజయవంతంగా ఛేదించింది. అయితే వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రష్యా సహకారంతో ఈ మిసైల్ 800 కిలో మీటర్ల టార్గెట్ ను రీచ్ అయ్యేలా సాంకేతికంగా అభివృద్ధి చేయనున్నట్లు శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇందుకోసం 36 వేల కోట్లతో తయారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రక్ష‌ణ‌ శాఖ తెలిపింది.

చైనా సరిహద్దు వివాదం, యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్స్ లో ఉపయోగించే బ్యాటరీల తయారీని భారత రక్ష‌ణ‌ శాఖ అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ లో ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా సుఖోయ్ 30, బ్రహ్మోస్ మిసైల్స్ ను భారత ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో మొహరించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో భారత ఆర్మీ ఈ మిసైల్స్ సహాయంతో దాయాదులతో హోరాహోరీ తలపడేందుకు సంసిద్ధంగానే ఉందనడంలో ఎటువంటి సంశయం లేదు.