అవన్నీ అవాస్తవాలే.. ఆ ఆలోచన ఇప్పట్లో లేదన్న బ్రహ్మానందం

ప్రముఖ కమెడియన్‌ బ్రహ్మానందంకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 8:58 am, Sun, 5 July 20

ప్రముఖ కమెడియన్‌ బ్రహ్మానందంకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. సినిమా ఆఫర్లు ఏవీ లేకపోవడంతో బ్రహ్మానందం బుల్లితెరకు షిఫ్ట్‌ అయ్యారని., ఓ సీరియల్‌లో నటించేందుకు ఆయన ఒప్పుకున్నారని ఇటీవల కొన్ని పుకార్లు వినిపించాయి. వాటిపై తాజాగా స్పందించారు హాస్య బ్రహ్మ. తనపై వచ్చిన పుకార్లన్నీ అవాస్తవాలేనని ఆయన అన్నారు.

”నేను ఎలాంటి సీరియల్స్‌లో నటించడం లేదు. గత మూడున్నర నెలలుగా నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఇప్పట్లో బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. మా ఇంట్లో ప్రస్తుతం సురక్షితంగా ఉన్నా. నా మనవడితో ఆడుకుంటున్నా. సమయమంతా వాడితోనే గడిచిపోతుంది. నా కెరీర్‌ గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. చాలా పుస్తకాలు చదువుతున్నా. డ్రాయింగ్‌లు వేస్తున్నా. నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నా. ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీడం లేదు” అని బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. కాగా బ్రహ్మానందం వేసిన శ్రీశ్రీ, కరోనాతో లాక్‌డౌన్‌ అయిన భారతదేశం డ్రాయింగ్‌లు ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.