మూఢనమ్మకం- మహిళలు వరుసగా కింద పడుకొని ఉంటారు, పూజరుల గుంపు తొక్కుకుంటూ వెళుతుంది..!

చత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లాలో ఓ చిత్రమైన ఆచారం కొనసాగుతోంది.. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత అక్కడ మధారి జాతర నిర్వహిస్తారు..

  • Balu
  • Publish Date - 1:02 pm, Tue, 24 November 20

చత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లాలో ఓ చిత్రమైన ఆచారం కొనసాగుతోంది.. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత అక్కడ మధారి జాతర నిర్వహిస్తారు.. ఆ జాతరలోనే మహిళలు తర్కరహితమైన ఆచారాన్ని పాటిస్తారు.. నమ్మకం ముదిరి మూఢనమ్మకంగా మారితే ఇలాంటివే జరుగుతుంటాయి.. సంతానం లేని మహిళలు వరుసగా కింద పడుకొని ఉంటే.. పూజారుల గుంపు వారిని తొక్కుకుంటూ వెళుతుంది.. పూజారులు అలా చేస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారన్నది అక్కడి వారి గట్టి నమ్మకం. ఈ ఆచారాన్ని పాటించిన అనేక మంది గర్భం దాల్చినట్టు చెప్పుకుంటారు. చాలా మంది జాతరకు హాజరయ్యే భక్తులు ముందు స్థానిక దేవత అయిన అంగార్‌మోతికి పూజలు చేస్తారు.. మొన్నామధ్య జరిగిన జాతరలో సుమారు రెండు వందల మంది మహిళలు కింద పడుకొని ఉండగా పలువురు పూజారులు మంత్రాలు చదువుతూ మహిళలను తొక్కుకుంటూ వెళ్లారు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. సాంకేతికంగా ఎంతో పురోగమిస్తున్న ఈ కాలంలో వీసమెత్తు శాస్త్రీయత కూడా లేని అలాంటి ఆచారాలు పాటించడమేమిటి? మూఢనమ్మకం కాకపోతే అని విమర్శిస్తున్నారు చాలా మంది! ఇలా చేస్తే సంతానం కలగడం మాట అటుంచి మహిళలకు లేనిపోని రోగాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్మయి నాయక్‌ కూడా ఈ వింత ఆచారాన్ని తప్పుపట్టారు. ఇలాంటివాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని అన్నారు. మహిళల వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి మూఢ నమ్మకాలకు వెంటనే స్వస్తి పలకాలని తెలిపారు. ఇలాంటి దుష్ట ఆచారాలపై మహిళలకు అవగాహన కల్పిస్తామని కిరణ్మయి నాయక్‌ అన్నారు.