ఈ నెల 26 న భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తారు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్, చట్టాలు రద్దు చేయాల్సిందే

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు.

  • Umakanth Rao
  • Publish Date - 3:25 pm, Thu, 14 January 21

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. తమ డిమాండ్లు తీరేవరకు అన్నదాతలు వెళ్లబోరని, అవసరమైతే మరో నాలుగేళ్లు..అంటే 2024 వరకు కూడా తమ ఆందోళనను పొడిగిస్తారని ఆయన అన్నారు. కానీ శుక్రవారం కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిధ్ధమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం, బీజేపీ నేతలు మమ్మల్ని టెర్రరిస్టులని వ్యవహరిస్తున్నంత కాలం మా  ఆందోళన ఇంకా ఉధృతమవుతుంది అని రాకేష్ తికాయత్ హెచ్ఛరించారు. సుప్రీంకోర్టు ఈ నెల 18 న ఏ ఉత్తర్వులు జారీ చేసినా తాము కూడా అంతే స్థాయిలో స్పందిస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి మరింతమంది అన్నదాతలను సమీకరిస్తామని, ఈ నెల 23 న అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

అటు- 26 న ఢిల్లీ శివార్లలో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ఈ రైతు సంఘంలోనే మరో నేత బల్వీందర్ సింగ్ ప్రకటించగా రాకేష్ తికాయత్ మాత్రం ఆ రోజున పరేడ్ జరిగే చోటే తాము ఈ ర్యాలీని చేపడతామని ప్రకటించడం గమనార్హం. ఇలా పరస్పర విరుధ్ద ప్రకటనలతో అన్నదాతల్లో అయోమయం నెలకొంటోంది.

Read Also:ఆందోళన విరమించిన భారతీయ కిసాన్ యూనియన్.. రైతు డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో..