దీదీకి 10 లక్షల ‘ జై శ్రీరామ్ ‘ పోస్టు కార్డులు.. బీజేపీ వ్యూహం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘ జై శ్రీరామ్ ‘ నినాదంతో ‘ ఉక్కిరిబిక్కిరి ‘ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమెకు ఈ నినాదంతో కూడిన 10 లక్షల పోస్టు కార్డులను పంపాలని నిర్ణయించినట్టు బరక్ పూర్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ వెల్లడించారు. గత శనివారం ఈ నినాదాలు చేసిన కొంతమంది తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన పోలీసు లాఠీచార్జీకి నిరసనగా ఈ వినూత్న నిరసన ‘ కార్యక్రమం ‘ చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. పైగా తన నియోజకవర్గంలోని భాత్ పర ప్రాంతంలో గత నెల 29 న ఈ నినాదాలు చేసిన పార్టీ కార్యకర్తల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ వారిని చెదరగొట్టాల్సిందిగా పోలీసులను పురమాయించిన విషయాన్ని అర్జున్ సింగ్ గుర్తు చేశారు. జై శ్రీరామ్ అని స్లోగన్ ఇస్తే ఆమెకు అంత భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు అధికార టీఎంసి ఎమ్మెల్యే అయిన ఈయన..తాజా లోక్ సభ ఎన్నికలముందు బీజేపీలో చేరారు. ఈ నెల 1 న ఉత్తర 24 పరగణ జిల్లాలోని కాంచరపురలో బీజేపీ స్వాధీనం చేసుకున్న తమ పార్టీ కార్యాలయాలను తిరిగి పొందేందుకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొందరు అక్కడికి చేరుకోగా..వారిని చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ నినాదం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు వారిని చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జి చేశారు. (కాంచరపుర సెగ్మెంట్ అర్జున్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బరక్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఉంది.) ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మమతా బెనర్జీని ఇరకాటాన బెట్టేందుకు జైశ్రీరామ్ నినాదంతో కూడిన పది లక్షల పోస్టుకార్డులను ఆమెకు పంపాలని నిర్ణయించినట్టు అర్జున్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. రాష్ట్రంలోని 42 సీట్లకు గాను ఈ పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో అక్కడ కమలనాథుల జోరు పెరిగింది.టీఎంసిని, దీదీని ఎలాగైనా దెబ్బ తీసేందుకు వారు చేయని ప్రయత్నమంటూ లేదు. అటు మమత కూడా పెరిగిన బీజేపీ
ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను చూస్తేనే అపరదుర్గలా వారిపై విరుచుకుపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ ఒకదానికొకటి ఢీ కొన్నప్పుడు జరిగే హింసపై విశ్లేషకులు అప్పుడే
అంచనాలు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *