ఆ రేపిస్టు ఇంకా మీతోనే.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్

Congress Leader Priyanka Gandhi, ఆ రేపిస్టు ఇంకా మీతోనే.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే.. కుల్దీప్ సింగ్ సెంగార్ ని ఇంకా మీ పార్టీ వదలలేదంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. బీజేపీని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్థానిక డైలీలో ప్రచురితమైన ఓ యాడ్ లో ఇతర బీజేపీ నేతలతో బాటు సెంగార్ ఫోటో కూడా ఉండడాన్ని ఆమె ప్రశ్నించారు. ఉన్నావ్ కేసులో సుప్రీంకోర్టు మిమ్మల్ని (బీజేపీని) తప్పు పట్టిందని, అలాగే సీబీఐ కూడా తన రిపోర్టులో ఈ రేప్ ఉదంతాన్ని , సెంగార్ నిర్వాకాన్ని పేర్కొందని, అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరింకా ‘ వేలాడుతున్నారని ‘ ప్రియాంక గాంధీ కమలనాథులపై ఫైరయ్యారు. ఈ యాడ్ లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో బాటు.. స్థానిక పార్టీ నేతల ‘ ముఖార విందాలు ‘ ఉన్నాయి. అయితే దీనిపై యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ని సంప్రదించగా.. సెంగార్ తమ ప్రాంత ఎమ్మెల్యే అని, అందుకే అతని ఫోటో చేర్చారని అన్నారు. సెంగార్ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ ఫోటో ఉంటుందన్నారు. ఏది ఏమైనా ఈ యాడ్ కమలం పార్టీకి ఇరకాట పరిస్థితిని సృష్టించింది. పైగా హర్దోయ్ నియోజకవర్గ బీజేపీ శాసన సభ్యుడు ఆశిష్ సింగ్ ఆషు… సెంగార్ పట్ల సానుభూతి చూపుతూ .. అతడు తన కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతాడో అని తామంతా చూస్తున్నామని వ్యాఖ్యానించి.. పార్టీని మరింత ‘ భ్రష్టు ‘ పట్టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *