మండలి రద్దుపై బీజేపీ జాతీయ విధానమిదే

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంతో తదుపరి ఏం జరుగుతుంది అన్న ఆసక్తి రాష్ట్రమంతటా నెలకొంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వైఖరి ఏంటన్న అంశం అందరిలోను ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతుందా? కేంద్రం, పార్లమెంట్, రాష్ట్రపతి పాత్ర ఏంటి? రాజ్యాంగాన్ని సవరించాలా? వంటి అనేక ప్రశ్నలు, సందేహాలు కూడా జనం మదిలో మెదులుతున్నాయి. అసలింతకీ వైకాపా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రంలో […]

మండలి రద్దుపై బీజేపీ జాతీయ విధానమిదే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2020 | 5:53 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంతో తదుపరి ఏం జరుగుతుంది అన్న ఆసక్తి రాష్ట్రమంతటా నెలకొంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వైఖరి ఏంటన్న అంశం అందరిలోను ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతుందా? కేంద్రం, పార్లమెంట్, రాష్ట్రపతి పాత్ర ఏంటి? రాజ్యాంగాన్ని సవరించాలా? వంటి అనేక ప్రశ్నలు, సందేహాలు కూడా జనం మదిలో మెదులుతున్నాయి. అసలింతకీ వైకాపా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఎంత మేర సమర్థిస్తుంది?

ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శాసన మండలి తొలిసారిగా రద్దయింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన ఎన్టీఆర్, శాసన మండలి వల్ల ఉపయోగం లేకపోగా, ప్రజాధనం వృధా చేయడమేనని భావించారు. రాజకీయంగా చూస్తే ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినా, తెలుగుదేశం ఆనాటికి కొత్త పార్టీ కావడంతో మండలిలో అసలు ఒక్క సభ్యుడు కూడా లేడు. మండలిలో బలం పెంచుకోడానికి కనీసం ఒక టర్మ్ పదవీకాలం పూర్తవుతుంది. ఈలోపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం లేదా జాప్యం చేయడానికి ఆస్కారం ఉందని భావించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి తొలిసారిగా రద్దయింది.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాజ్యాంగంలోని 168, 169, 170, 171 అధికరణలు (ఆర్టికల్స్) రాష్ట్రాల శాసన వ్యవస్థల గురించి నిర్వచిస్తున్నాయి. ఇందులో ఆర్టికల్ 169 రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు, రద్దు గురించి చెబుతోంది. ఆర్టికల్ 171 ప్రకారం ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మూడవ వంతు మించకుండా శాసన మండలిని ఏర్పాటు చేయాలి. అలాగే కనీసం 40 సీట్లు శాసన మండలిలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కనీస సంఖ్య 40తో శాసన మండలి ఏర్పాటైంది.

శాసన మండలి ఏర్పాటుకైనా, రద్దుకైనా ప్రక్రియ దాదాపు ఒకటే. ఆర్టికల్ 169 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం ద్వారా శాసన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు మూడొంతుల మెజారిటీతో తీర్మానం చేసి పంపాలి. దాన్ని కేంద్ర హోంశాఖ, న్యాయ శాఖ పరిశీలించి కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదం పొందాక పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి రాజముద్ర వేసి, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు ఒక నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తిచేయాలన్న నిబంధన ఏదీ లేదు. కేంద్రం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ విధానంపై మండలి ఏర్పాటు లేదా రద్దు ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.

ఏయే రాష్ట్రాల్లో శాసన మండలి (విధాన పరిషత్) ఉంది?

గత ఏడాది జమ్ము-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుతో అక్కడున్న శాసన మండలి రద్దయిన తర్వాత మొత్తం 28 రాష్ట్రాలు కలిగిన దేశంలో శాసన మండలి కలిగిన రాష్ట్రాలు కేవలం 6 మాత్రమే. అవి.. 01. ఆంధ్రప్రదేశ్ 02. తెలంగాణ 03. బిహార్ 04. కర్నాటక 05. మహారాష్ట్ర 06. ఉత్తర్ ప్రదేశ్

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శానస మండలిని రద్దు చేస్తే మిగిలేది కేవలం ఐదు రాష్ట్రాల్లోనే. అయితే గతంలో మండలి ఉండి, రద్దు చేసిన రాష్ట్రాలు కొన్ని తిరిగి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాయి. ఇలా మళ్లీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, అస్సాం ఉన్నాయి. వీటిలో తమిళనాడు రాష్ట్రం మండలి పునరుద్ధరణ కోసం 3 పర్యాయాలు విఫలయత్నం చేసింది. అలాగే కొత్తగా మండలి ఏర్పాటు చేయాలంటూ రాజస్థాన్, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

తమిళనాడు వ్యవహారం : ఆద్యంతం నాటకీయం : ఆంధ్రప్రదేశ్ ఆసక్తికరం

శాసన మండలిని గతంలో కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు విషయంలో రద్దు నిర్ణయం నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఏఐఏడీఎంకేకు చెందిన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1986లో ఆ రాష్ట్ర శాసన మండలి రద్దయింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం తాను నిర్ణయించిన వ్యక్తిని నామినేటెడ్ ఎమ్మెల్సీని చేయలేకపోవడమే. తమిళ నటి నిర్మల అలియాస్ శాంతిని ఎమ్మెల్సీని చేయాలని ఎంజీఆర్ అనుకున్నారు. ఆ మేరకు నామినేటెడ్ ఎమ్మెల్సీగా 1986 ఏప్రిల్ 23న ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే ఆమె అప్పటికే ఇన్‌సాల్వెన్సీ (ఐపీ) పెట్టడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(సీ) ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లించలేక ఐపీ పెట్టిన వ్యక్తి దేశంలోని ఏ చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడం కుదరదని ఎస్.కే సుందరం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో ఆమె చెల్లించాల్సిన రుణం కోసం ఎంజీఆర్ రూ. 4,65,000 ఆమెకు చేబదులుగా ఇచ్చి ఇన్‌సాల్వెన్సీ వ్యవహారాన్ని రద్దు చేయించగలిగారు. అయినప్పటికీ ఆ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగడంతో నిర్మల తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో మనస్తాపం చెందిన ఎంజీఆర్ ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత డీఎంకే పలుమార్లు మండలి పునరుద్ధరణ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదీ సఫలం కాలేదు.

ఇంక ఆంధ్రప్రదేశ్ మండలి వ్యవహారానికి వస్తే.. 1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన తర్వాత 1989లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మండలి పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించి 1990 జనవరి 22న శాసనసభలో ఓ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ, మండలిని రద్దు చేసి ఐదేళ్ల లోపే కావడంతో మళ్లీ పునరుద్ధరణ సాధ్యపడదని లోక్‌సభ తేల్చి చెప్పడంతో అది అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004 జులై 8న శాసన మండలి పునరుద్ధరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై పార్లమెంటు ఉభయ సభలు చర్చ జరిపి 2006 డిసెంబర్లో ఆమోదించాయి. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదం పొంది అదే ఏడాది మార్చి 30న మండలి మళ్లీ జీవం పోసుకుంది.

కేంద్రం ఏం చేయబోతుంది?

ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేయడం రాజకీయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెడుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలో మండలిని పునరుద్ధరించినా లేదా కొత్తగా ఏర్పాటు చేసినా, మండలి ఏర్పాటు కోరుతున్న మిగతా అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. మండలి ఏర్పాటు వల్ల అసంతృప్త నేతలకు, రాజకీయ నిరుద్యోగులకు పదవులిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ ఆ ప్రయోజనం పొందలేదు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులు, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీంతో సొంత పార్టీకి వచ్చే ప్రయోజనం కంటే మిగతా పార్టీలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చినట్టవుతుంది. ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శానస మండలి రద్దు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఆ రాష్ట్రంలో బలపడాలంటే టీడీపీ వంటి బలమైన పార్టీ బలహీనపడితే తప్ప సాధ్యం కాదని భావిస్తున్న కమలనాథులకు, వారిని దెబ్బకొట్టే అవకాశం వైకాపా ఇస్తుంటే ఎందుకు వదులుకుంటారు అనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో పాటు శాసన సభలో ఎలాగూ చోటు లేని బీజేపీ, తనకున్న ఇద్దరు ఎమ్మెల్సీలను రోడ్డున పడేసే ఈ తీర్మానానికి ఎందుకు సై అంటుందనే చర్చ కూడా మరోవైపు జరుగుతోంది. అయితే మండలి రద్దు విషయంలో బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం పరోక్షంగా రద్దును వెంటనే ఆమోదిస్తామని సంకేతాలిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దుపై ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయని కూడా అంటున్నారు. తమ పార్టీ విధానం సైతం మండలి పట్ల సానుకూలత ప్రదర్శించడం లేదని వారంటున్నారు. దీంతో ఏపీ శాసన మండలి కథ కంచికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

– మహాత్మ కొడియార్ సీనియర్ జర్నలిస్టు, టీవీ9

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..