17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

Lok Sabha Speaker, 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

లోక్‌‌సభ సమావేశాలు ప్రారంభం కావడంతో 17వ లోక్ సభకు స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న వార్తలకు బీజేపీ తెరదించింది. లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లాను ఎంపిక చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ, ఇతర ప్రతిపక్ష పార్టీలూ సపోర్ట్ చేశాయి. నామినేషన్ దాఖలుకు వేరే అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు అధికార, విపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు.

ఇకపోతే రాజస్థాన్​లోని కోటా లోక్​సభ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాకు, అంతకుముందు మూడు సార్లు కోటా సౌత్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక లోక్​సభ స్పీకర్​ పోస్టు రాజస్థాన్​కు దక్కనుండటం ఇదే తొలిసారి. స్పీకర్​ క్యాండేట్​గా బిర్లా పేరును ప్రపోజ్​ చేస్తూ బీజేపీ.. మంగళవారం లోక్​సభ సెక్రటేరియట్​కు నోటీసు ఇచ్చింది. ఎన్డీఏ పార్టీలకు తోడు ఎన్డీఏలో లేని వైఎస్సార్​సీపీ, బీజేడీ పార్టీల మద్దతూ తమకున్నట్లు నోటీసులో పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించాల్సిందిగా కాంగ్రెస్‌ను కూడా కోరారు. కొత్త స్పీకర్‌గా బాధ్యతలు తీసుకుంటున్న ఓం బిర్లా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. స్వీట్లు తినిపించుకుంటూ కుటుంబీకులు సంతోషాన్ని పంచుకున్నారు. పేరు ప్రకటించిన కొద్దిసేపటికే బిర్లా.. మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్​ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సాధారణంగా అన్ని పార్టీలూ సుదీర్ఘ అనుభవమున్న నేతలను మాత్రమే స్పీకర్​ స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఫస్ట్​టైమ్​ లేదా సెకండ్​టైమ్​ ఎంపీలకు ఈ అవకాశం దక్కడం చాలా అరుదు. 16వ లోక్​సభకు స్పీకర్​గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్​కు ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆమె వారసుడెవరనే దానిపై కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఎంతో మంది సీనియర్లు ఉన్నా, సెకండ్ టైమ్ ఎంపీ ఓం బిర్లాకే అవకాశం కల్పించాలన్న నిర్ణయం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్​ అమిత్​ షాలదేనని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *