ఇక బీజేపీ టార్గెట్ వీళ్లేనా ?

bjp next target is kcr followed by jagan, ఇక బీజేపీ టార్గెట్ వీళ్లేనా ?

దేశంలో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఇటీవలి ఎన్నికల్లో కమలనాథులు భారీగా బలం పుంజుకున్నారు. ‘ కమల ‘ దళం దాదాపు పూర్తిగా వికసించింది. ఈ ‘ బలం ‘ ఇఛ్చిన ఉత్తేజంతో ఇక బీజేపీ నేతల దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడడానికి రెడీగా ఉంది. ఏపీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమి తెలంగాణ సిఎం కేసీఆర్ కు కూడా ఒకరకంగా మింగుడు పడడంలేదు. తెలంగాణాలో ఒక్కసారిగా బీజేపీ తన స్థాయిని పెంచుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఒక్కసారిగా నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఎవరూ ఊహించని పరిణామం. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకున్న కమలం పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 20 శాతం ఓట్లను సాధించి ముఖ్యంగా టీ ఆర్ ఎస్ నేతలకు షాకిచ్చింది. నిజామాబాద్ లో తన కుమార్తె కవిత ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణాలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను ఓడించి..ఈ రాష్ట్రం లోనూ పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో కేవలం పసుపు రైతులు, కొందరు తెరాస అసమ్మతినేతలు కవిత ఓటమికి కారకులవుతారని ఎవరూ ఊహించలేదు కూడా. పసుపు రైతులు ఏకంగా వారణాసికి వెళ్లి నామినేషన్లు వేయడం జాతీయ రాజకీయాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇక ఏపీ విషయానికి వస్తే.. కొత్తగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత జగన్ పాలనా సరళిని బీజేపీ అగ్ర నేతలు నిశితంగా గమనించనున్నారని తెలుస్తోంది. ఏ సమస్యపైనా ఆయన కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోవచ్ఛు . తనపై 31 కేసులు పెండింగులో ఉన్న జగన్.. దాదాపు ప్రేక్షక పాత్ర వహించవలసి రావచ్ఛు సుమారు రెండున్నర లక్షల కోట్ల నష్టంతో ఖజానా ఉందని జగన్ స్వయంగా ఇటీవల పేర్కొన్న సంగతి గమనార్హం. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ వద్ద ఒదిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్ఛే నిధులపై ఆధారపడక తప్పదు మరి !. ఒకవేళ తమ పార్టీలో విలీనం కావాలని బీజేపీ నాయకులు వైసీపీని కోరితే ఏం చేయాలో ఈ పార్టీ ఊహించలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అండ్ కో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఫిర్యాదు అయినా మోదీ ప్రభుత్వానికి అందితే వైసీపీ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవలసిందేనంటున్నారు. అంటే ఏపీలోని కొత్త ప్రభుత్వం ‘ జుట్టు ‘ కేంద్రం గుప్పిట్లో ఉన్నట్టే.. ఇలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలోని ‘ వోలటైల్ ‘ పరిస్థితులను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవచ్ఛు. ముఖ్యంగా కర్ణాటక మీద కమలం పార్టీ ఎప్పటినుంచో ఫోకస్ పెట్టింది. అక్కడి మాజీ సిఎం, పార్టీ నేత యడ్యూరప్ప ‘ అవకాశం ‘ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ రాష్ట్రంలోనూ బీజేపీ బలం ఇప్పుడు పుంజుకుంది. తమిళనాడులో డీ ఎం కె కూడా బీజేపీకి మరీ విముఖంగా ఏమీ లేదు. కాలానుగుణంగా ఆ పార్టీతో దోస్తీ కట్టినా కట్టవచ్ఛు .ఆ రాష్ట్రంలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలా చూసినా బీజేపీ తదుపరి టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలేనని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *