తెలంగాణలో కూడా ఎన్ఆర్‌సీ తేవాల్సిందే..

BJP MLA Raja Singh Demands Initiation of NRC in Telangana state, తెలంగాణలో కూడా ఎన్ఆర్‌సీ తేవాల్సిందే..

అసోంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ఇవాళ విడుదల అయిన విషయ తెలిసిందే. అయితే ఈ జాతీయ పౌర రిజిస్టర్ అంశంపై తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నాఆర్సీని తెలంగాణలోనూ అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించేందుకు ఎన్నార్సీ తప్పని సరి అన్నారు. నగరంలో ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇక్కడ బంగ్లాదేశీయులు, మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింటు అక్రమంగా ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు.

హైదరబాద్ ఎంపీ, తన ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు తెలంగాణలో షెల్టర్ కల్పిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అసోంలో అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని తెలంగాణలోనూ అమలు చేయాలని.. తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17 నుంచి దీనిని అమలు చేయాలని.. తేదీ కూడా చెప్తూ హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ట్యాగ్ చేశారు.

అంతేకాదు మరో బీజేపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, కాబట్టి ఇక్కడ కూడా ఎన్ఆర్సీని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని.. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో అక్రమ వలసదారులు ఎక్కువయ్యారన్నారు. తెలంగాణ పోలీసుల లెక్కలు మాత్రం రాష్ట్రంలో 5000 మంది రోహింగ్యాలు ఉన్నట్టు చెబుతున్నా, వాస్తవానికి లక్ష మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని ఆరోపించారు. వీరిని ఎంఐఎం తమ ఓట్ బ్యాంక్‌గా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ అక్రమ వలసవాదుల సమస్య టైం బాంబ్ లాంటిదంటూ పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా జాతీయ పౌరపట్టికను తయారు చేయాలని కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి ఫిర్యాదు కూడా చేస్తామన్నారు.

కాగా దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమివేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ ను విజిట్ చేసిన సందర్భంలోనూ ఆయన నగరంలోని అక్రమ బంగ్లాదేశీయులను పంపివేసేందుకు ఎన్నార్సీ వంటి ప్రక్రియ అవసరమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *