బ్రేకింగ్: బీజేపీ-జనసేన పొత్తు ఖరారు..ఉమ్మడి ఎజెండా ఇదే

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రెండు పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు  కలిసి ముందుకెళతాయని, నరేంద్ర మోదీ […]

బ్రేకింగ్: బీజేపీ-జనసేన పొత్తు ఖరారు..ఉమ్మడి ఎజెండా ఇదే
Follow us

| Edited By: Umakanth Rao

Updated on: Jan 16, 2020 | 3:44 PM

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రెండు పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు  కలిసి ముందుకెళతాయని, నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, అమిత్ షా సూచనల మేరకు రెండు పార్టీలు ముందుకు వెళతాయని అన్నారాయన.  2014 నుంచి ముందుగా టీడీపీ, ఆ తర్వాత వైసీపీ అధికారంలో వుంటూ అవినీతిమయమైన పాలనను అందించాయని కన్నా ఆరోపించారు. ఏపీలో సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీ-జనసేనలతోనే సాధ్యమని కన్నా అన్నారు.

రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను ఆయన దుయ్యబట్టారు. రాజధాని విషయంలో రెండు పార్టీలు కలిసి వీధి పోరాటాలకు దిగుతాయని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఏక పక్ష నిర్ణయంతో రాజధానిని తరలించగలమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తే అది భ్రమే అవుతుందని కన్నా అన్నారు. జగన్ నియంతృత్వ, అహంకార ధోరణి ప్రజాస్వామ్యంలో చెల్లవని కన్నా విమర్శించారు.

బీజేపీతో పొత్తును ఎండార్స్ చేసిన పవన్ కల్యాణ్… భారతీయ జనతాపార్టీ అండదండా ఏపీకి అత్యంత అవసరమని చెప్పారు. ఏపీ ప్రజల రక్షణ, సంక్షేమ, అభివృద్ధి కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయని చెప్పారు. ఇరు పార్టీల మధ్య సంపూర్ణ అవగాహన కుదిరిందని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు పార్టీల మధ్య ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని, ప్రతీ నెలకోసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ కలిసి వెళతామని వెల్లడించారు జనసేనాని. రాజధాని విషయంలో మెజారిటీ వుంది కదా అని జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళతామంటే కుదరదని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో తాము క్లియర్ కట్‌గా వున్నామని, అయిదు కోట్ల ఆంధ్రులు అమరావతికి అంగీకరించారని అన్నారు. ఇపుడు మారుస్తామంటే కుదరదని, అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే లీగల్ బ్యాటిల్‌కు రెడీ అన్నారాయన. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనేదే రెండు పార్టీల అభిమతమని చెప్పారు పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ. హైకోర్టు ఒక్కటి ఇచ్చినంత మాత్రాన కర్నూలుకు, రాయలసీమకు రాజధాని వచ్చినట్లు  కాదని అన్నారు. గతంలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య కొంత సమాచార లోపం తలెత్తిందని, ప్రస్తుతం సమన్వయ కమిటీతో ఎలాంటి సమస్యలు రాకుండా రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని తెలిపారు.

టీడీపీ, వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ళ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసేందుకు సుముఖత వ్యక్తం చేసిన నరేంద్ర మోదీకి, అమిత్ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసేందుకు ఎలాంటి షరతులు విధించలేదని ఆయన చెప్పారు.

బీజేపీ-జనసేన పార్టీల అలయెన్స్ 2024లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ ధియోధర్ అన్నారు.

రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు చారిత్రాత్మకమన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు. గతంలో కొన్నాళ్ళు వైసీపీతోను, మరికొన్నాళ్ళు టీడీపీతోను బీజేపీ కలిసి వెళుతుందన్న ప్రచారాలు జరిగాయని, అవన్నీ అవాస్తవాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక్క జనసేన పార్టీతోనే బీజేపీ వచ్చే నాలుగేళ్ళు కలిసి పని  చేస్తాయని జీవిఎల్ తెలిపారు.

జనసేన, బీజేపీ నేతల భేటీ సుమారు మూడు గంటలకు పైగా జరిగింది. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ సునీల్ ధియోధర్, ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ముఖ్యనాయకుడు నాదెండ్ల మనోహర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రెండుపార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు.

అంతకు ముందు బీజేపీ నేతలు గురువారం ఉదయాన్నే రాష్ట్ర కార్యాలయంలో ముందస్తు సమావేశాన్ని నిర్వహించి, జనసేన నేతలతో చర్చల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై ఓ క్లారిటీకి వచ్చారు. ఈ చర్చల్లో సునీల్, కన్నాలతోపాటు జీవిఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీతో ఎలాంటి ఉమ్మడి ఎజెండాతో కలిసి పనిచేయాలనే అంశంపై చర్చ జరిగినట్లు కన్నా… ఆ పార్టీతో చర్చల వేదికకు బయలుదేరే ముందు మీడియాకు తెలిపారు. అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలే తమ ఎజెండా కావని మరో నేత జీవిఎల్ తెలిపారు. రెండు పార్టీల మధ్య ఉమ్మడి ఎజెండా రూపొందిస్తామని చెప్పారాయన. 2024 ఎన్నికల దాకా ఎలాంటి అంశాలతో కలిసి పని చేయాలని, రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా తమ రెండు పార్టీలు ఎలా ఎదగాలనే అంశంపై చర్చలు జరుపుతామని జీవిఎల్ చెప్పారు.