దయ్యమై తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే

ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామ ప్రజలకు నిద్దర ఉండటం లేదు.. రాత్రి అయితే చాలు గజగజమని వణికిపోతున్నారు.. ఒంటరిగా గడపదాటి బయటకు అడుగు పెట్టడానికి జంకుతున్నారు.

దయ్యమై తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే
Follow us

|

Updated on: Sep 16, 2020 | 1:25 PM

ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామ ప్రజలకు నిద్దర ఉండటం లేదు.. రాత్రి అయితే చాలు గజగజమని వణికిపోతున్నారు.. ఒంటరిగా గడపదాటి బయటకు అడుగు పెట్టడానికి జంకుతున్నారు.. కారణం పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే దయ్యమై తిరుగుతున్నాడట! చిన్నపాటి చప్పుడుకే హడలిపోతున్నారు గ్రామ ప్రజలు. కంటినిండా కునుకు తీసి చాలా కాలం అయ్యిందని వాపోతున్నారు.. సాయంత్రం అయిదయిదంటే చాలు ఎక్కడున్నా ఇంటికొచ్చేస్తున్నారు. తలుపులకు గొళ్లెం వేసుకుని కాలం గడుపుతున్నారు.. వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ జరిగి రెండు నెలలు దాటుతున్నా ఇంకా తుపాకీ చప్పుళ్లు వినిపిస్తున్నాయట! రాత్రుళ్లు కాల్పుల శబ్ధం స్పష్టంగా వినిపిస్తున్నదని ఊరివాళ్లు అంటున్నారు.. ఆత్మగా సంచరిస్తున్న వికాస్‌ దూబే ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకుంటాడని భయంభయంగా చెబుతున్నారు. వికాస్‌ దూబే దయ్యాన్ని తాము చూశామని కొంతమంది చెప్పడం విశేషం. వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత అతడి ఇంటిని ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే.. కూలిన ఆ ఇంటి గోడల మీద వికాస్‌ దూబే కూర్చొని ఉండటం కళ్లారా చూశామంటున్నారు. వృద్ధులైతే వికాస్‌ ఆత్మ సంచరిస్తున్నదని గట్టిగా నమ్ముతున్నారు. కూలిన ఆ ఇంట్లోంచి అప్పుడు మాటల చప్పుడు వస్తున్నదట. నవ్వులు కూడా వినిపిస్తున్నాయట!

అసహజ మరణాలు జరిగినప్పుడు దయ్యాలవ్వడం సర్వసాధారణమైన విషయమని స్థానిక పూజారి అంటున్నారు.. ఆయుష్షు తీరకముందే చనిపోయాడు కాబట్టే ఆత్మగా మారి తిరుగాడుతున్నాడని చెబుతున్నారు. వికాస్‌ దూబే దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరపలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. శాంతి పూజలు చేయించాల్సిందిగా పూజారిని కోరినా పోలీసుల భయం కారణంగా ఆయన అంగీకరించడం లేదని అంటున్నారు. వికాస్‌ దూబేతో పాటు చనిపోయిన పోలీసుల ఆత్మశాంతి కోసం విజయదశమి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే … ఎన్‌కౌంటర్‌ తర్వాత బిక్రూ గ్రామంలో విధులను నిర్వహిస్తోన్న పోలీసులు ఇదంతా కట్టకథలని కొట్టిపారేయడం.. ప్రస్తుతం అక్కడ నలుగురు పోలీసులు గస్తీ కాస్తున్నారు.. ఇందులో ఇద్దరు మహిళా పోలీసులున్నారు.