Big News Big Debate: మునుగోడులో మొదలైన యుద్ధం.. ఒకరిని మించి మరొకరు ఎత్తులు పైఎత్తులు..!

Big News Big Debate: మునుగోడులో అసలు యుద్ధం మొదలైంది. ప్రజాదీవెన పేరుతో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్‌.

Big News Big Debate: మునుగోడులో మొదలైన యుద్ధం.. ఒకరిని మించి మరొకరు ఎత్తులు పైఎత్తులు..!
Big News Big Debate
Follow us

|

Updated on: Aug 19, 2022 | 8:22 PM

Big News Big Debate: మునుగోడులో అసలు యుద్ధం మొదలైంది. ప్రజాదీవెన పేరుతో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్‌. ఇక మన మనుగోడు మన కాంగ్రెస్‌ అంటూ కార్యక్షేత్రంలో దిగుతోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు 21న అమిత్‌షా సభ విజయవంతం చేయడానికి కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ గెలిచి సత్తా చాటుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తుంటే.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక కొంతకాలంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీకి మునుగోడు ఎన్నిక సవాలుగా మారింది.

లక్షల మందితో కేసీఆర్ సభకు ప్లాన్స్.. మొత్తానికి తెలంగాణలో పార్టీలన్నీ మునుగోడు దారివైపు నడుస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక చావోరేవో అన్నట్టుగా మారడంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కేసీఆర్‌ సభతో నియోజకవర్గంలో ప్రచారం పతాకస్థాయికి చేరబోతుంది. టీఆర్ఎస్‌ అధినేత ప్రజాదీవెన సభకు లక్షల మందితో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ నుంచి మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగే అవకాశం ఉంది. తాజాగా విద్యుత్‌ వివాదం కూడా మరో అస్త్రంగా మారింది అధికార టీఆర్ఎస్‌ పార్టీకి.

సిట్టింగ్ సీటు నిలుపుకోవడానికి.. ఇక అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా కదనరంగంలోకి దిగుతోంది. రాజీవ్‌ సద్భావనా దివస్‌ సందర్భంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. ఇందుకు మునుగోడును వేదికగా మలుచుకుంది. ఇప్పటికే ‘మన మునుగోడు మన కాంగ్రెస్‌’ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన హస్తం నాయకులు.. ప్రచారంలో స్పీడు పెంచాలని నిర్ణయించారు. సిట్టింగ్‌ స్థానంలో పాగా వేయాలని పట్టుదలగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు ధీటుగా అమిత్‌షా సభతో సత్తా చాటాలనుకుంటోంది. భారీగా చేరికలతో పాటు.. పార్టీ బలాన్ని చూపిస్తామంటోంది. 21న జరిగే సభకు లక్షల మందిని తలరిస్తామంటోంది. అమిత్‌షా సభ ఉంటుందని తెలిపి.. భయంతో కేసీఆర్‌ పోటీ సభ పెట్టారంటున్నారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడుకు, నల్గొండ జిల్లాకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌ రావాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే.

మరి బలప్రదర్శనకు దిగుతున్న మూడు పార్టీల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉంది?.. వారి ఓటు ఎటు? అన్నది ఉత్కంఠగా మారింది. ఎవరికి వారే విజయంపై ధీమగా ఉన్నారు. రిజల్ట్‌ వస్తే కానీ ఎవరి సత్తా ఏంటో తేలదు.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..