AP హౌసింగ్‌ స్కీమ్‌… పొలిటికల్‌ గేమ్‌

YSR జగనన్న కాలనీల ముహూర్తం మళ్లీ వాయిదా పడింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం సాంకేతిక కారణాలతో ముహూర్తం మార్చింది. TDP వేసిన కోర్టు కేసులే కారణంగా..

AP హౌసింగ్‌ స్కీమ్‌... పొలిటికల్‌ గేమ్‌
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 10:37 PM

జగన్‌ ఇంటిగుట్టు విప్పుతామన్న విపక్షం TDP బండారమే బయటపెట్టామన్న సర్కార్‌

YSR జగనన్న కాలనీల ముహూర్తం మళ్లీ వాయిదా పడింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం సాంకేతిక కారణాలతో ముహూర్తం మార్చింది. TDP వేసిన కోర్టు కేసులే కారణంగా పేదలకు పథకాలు అందకుండా పోతున్నాయని ఆరోపించింది YCP. ఆగస్టు 15 నాటికైనా సానుకూలంగా తీర్పు వస్తే… పేదలకు భూములు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేస్తామమన్నారు CM. అటు 2014-19 మధ్య కట్టిన ఇళ్లను పేదలకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించింది తెలుగుదేశం. మొత్తానికి ఏపీలో ఇళ్ల స్థలాల పథకం కేంద్రంగా సరికొత్త రాజకీయం నడుస్తోంది.

అసలు పథకమేంటి? జనాభాలో సుమారు 20శాతం మందికి అంటే 30లక్షల కుటుంబాలకు ఇంటిస్థలాలు రిజిస్టర్‌ చేయనుంది ఏపీ సర్కార్‌. ఇందుకోసం 62వేల ఎకరాలు సిద్దం చేశారు అధికారులు. 25వేల ఎకరాల ప్రభుత్వ భూమి కాగా.. 23వేల ఎకరాల ప్రైవేటు ల్యాండ్‌ సేకరించారు. విశాఖలో 4వేల ఎకరాలు, CRDAలో 11వందల ఎకరాలు, టిట్కో ద్వారా 2500 ఎకరాలు సమకూర్చారు అధికారులు. ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.7500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సీఎం జగన్‌ చెబుతున్న లెక్క ప్రకారం మొత్తం రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి పేదలకు పంచుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందన్నది వైసీపీ వాదన. ఇళ్ల స్థలం ఇవ్వడమే కాదు… ఇచ్చిన నెలరోజుల్లోనే 15లక్షల ఇళ్లు కట్టించాలన్నది లక్ష్యం. నవరత్నాల్లో ఒకటైనా ఈ పథకం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమలు చేయాలని ముందుగా భావించినా వాయిదా పడుతూ వస్తోంది. YSR జన్మదినం సందర్భంగా జులై 8న ముహూర్తం పెట్టారు.. అయితే కోర్టు కేసులు, కరోనా నేపథ్యంలో మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 15న మరోసారి డేట్‌ ఫిక్స్‌ చేశారు CM జగన్‌. ఈ పథకంలో మరో ప్రత్యేకత కూడా జోడించారు సీఎం జగన్‌. అర్హులు ఎవరైనా సరే ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు.

ఏంటీ పొలిటికల్‌ వార్‌? ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టుకు వెళ్లడం వల్లే ఆగిపోయిందన్నది వైసీపీ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేస్తామన్నారు జగన్‌. అయితే దీనిపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాకపోయినా.. అందులో జరిగిన అవినీతిపైనే పోరాటం చేస్తున్నామన్నారు తమ్ముళ్లు. 7వేల 500 కోట్లతో కొనుగోలు చేసిన స్ధలాల్లో వందల కోట్ల అవినీతి జరిగిందన్నది విమర్శ. 2014 -19 మధ్య 21.52లక్షల ఇళ్లు మంజూరు చేసి.. 7లక్షల 93వేల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో 6లక్షల ఇళ్లు ఉన్నాయి. పూర్తి చేయకుండా వదిలేశారని.. దీని వల్ల ప్రజాధనం వృధా అవుతుందన్నది టీడీపీ నేతల ఆరోపణ. అంతేకాదు… వైసీపీ నేతలు పేదల భూములు లాక్కుని తమ పేర్లతో రిజిస్టర్‌ చేయించుకుని మరీ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది టీడీపీ చెబుతున్న మాట. దీనిపై CBI విచారణ అడుగుతామంటున్నారు. రాజమండ్రి దగ్గర ఆవ భూముల్లోనే 150 కోట్లు కాజేశారని ఆరోపిస్తున్నారు. అవినీతి జరిగితే ఖచ్చితంగా కేసులు పెడతాం.. కోర్టుకు వెళతామంటున్నారు తమ్ముళ్లు. 8లక్షల ఇళ్లు అధ్బుతంగా కట్టిస్తే పేదలకు ఇవ్వకుండా కేవలం కక్షతోనూ… అవినీతి కోసం ఇళ్ల స్ధలాల డ్రామా ఆడుతున్నారన్నారు. అయితే దీనిపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోంది వైసీపీ. గత ప్రభుత్వం పేదలకు కట్టింది 3.5లక్షల ఇళ్లు మాత్రమేనంటోంది ప్రభుత్వం. కట్టాలని భావించింది కేవలం 6.5లక్షలు. అంతేకాదు బకాయిలు రూ.13వందల కోట్లు పెట్టిందన్నారు. అర్బన్‌ హౌసింగ్‌లో 7లక్షలు కట్టాలనుకున్న టీడీపీ ప్రభుత్వం.. 3లక్షల ఇళ్లు స్టార్ట్‌ చేసి ఆపేశారన్నారు. టీడీపీ మాటలు ఎక్కువ చేతలు తక్కువగా మారిందన్నారు. ఇక టీడీపీ టెండర్లతో హౌసింగ్‌ స్కీమ్‌లో 4వందల కోట్లు దోచిపెట్టిందన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కేసులతో TDP అడ్డుకుంటుందన్నారు CM జగన్‌. గత ఐదేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం ఇళ్లు కూడా నిర్మాణం జరగలేదన్నారు. టీడీపీ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ఇరు పార్టీల మధ్య లెక్కలు తిక్కలు ఇప్పట్లో తేలేలా లేవు.

టీడీపీ లక్షల ఇళ్లు కట్టామంటోంది… ఎక్కడ కట్టారని నిలదీస్తోంది YCP. స్థలాల్లో అవినీతి అని విపక్షం ఆరోపిస్తోంది. దమ్ముంటే నిరూపించాలని సవాలు చేస్తోంది ప్రభుత్వం. మొత్తానికి ఇళ్లస్థలాలు కాస్తా రాజకీయ రణక్షేత్రాలుగా మారుతున్నాయి. ఇంతకీ కొసమెరుపు ఏంటంటే… 21లక్షల మందికి ఇళ్లు మొదలుపెట్టామంటోంది టీడీపీ. 30లక్షల మందికి స్థలాలు ఇస్తామంటోంది వైసీపీ. మరి నిజంగా రాష్ట్రంలో ఇంతమంది ఇళ్లు లేని వారున్నారా? అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇన్నేళ్లుగా పథకాలు అమలు అవుతున్నా… ఇంకా పేదలకు ఇళ్లు దక్కలేదా? దీనికి నాయకులే సమాధానం చెప్పాలి.

Note: ఇదే అంశంపై టీవీ9లో బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో చర్చ జరిగింది… వీడియో కోసం కింద లింక్‌పై క్లిక్‌ చేయండి.