AP Local War Live updates : ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల షెడ్యూల్ ‘పంచాయితీ’.. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

 • Venkata Narayana
 • Publish Date - 7:00 pm, Sat, 9 January 21
AP Local War Live updates : ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల షెడ్యూల్ ‘పంచాయితీ’.. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

AP Live Updates : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్‌ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూరహంకాపురితంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో బాల్ హైకోర్టుకు చేరినట్లైంది.

ఇదిలావుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై అధికార వైసీపీ ఫైర్ అవుతుంటే, ఎన్నికల షెడ్యూల్ విడుదలను టీడీపీ, బీజేపీ స్వాగతించాయి. గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 09 Jan 2021 19:00 PM (IST)

  కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించాలిః దేవినేని ఉమా

  స్థానిక ఎన్నికలు జరుపుతామంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం సరికాదన్నారు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర మంత్రులు తప్పబట్టడం హాస్యాస్పదమన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలన్న ఉమా.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రీనోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించాలని దేవినేని ఉమా కోరారు.

 • 09 Jan 2021 18:51 PM (IST)

  ఎస్ఈసీ నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులదేః అశోక్‌బాబు

  ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాలే గానీ ఎన్నికలు వద్దని మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని అశోక్ బాబు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు వ్యవస్థలు పరస్పర సహకారంతో.. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు కోరారు.

 • 09 Jan 2021 18:38 PM (IST)

  ఎస్ఈసీ మరో కీలక ఉత్తర్వులు జారీ

  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు.

 • 09 Jan 2021 18:34 PM (IST)

  చంద్రబాబు మద్దతుతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలః పెద్దిరెడ్డి

  ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతుతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్‌పై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. డిపాజిట్లు కోల్పోయిన వారికి నిమ్మగడ్డ రమేష్ కాపు కాస్తున్నారని దుయ్యబట్టారు. 51 శాతం ఓట్లు సాధించిన ప్రజానాయకుడు జగన్‌ను గుర్తించాలని పెద్దిరెడ్డి అన్నారు.

 • 09 Jan 2021 18:31 PM (IST)

  ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందిః బాలినేని

  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, అధికారపార్టీ నేత ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుబట్టారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు.

 • 09 Jan 2021 18:23 PM (IST)

  ఎన్నికలను బహిష్కరిస్తామని ఎపి ఎన్‌జివో సంఘం హెచ్చరిక

  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను వాయిదా వేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఎపి ఎన్‌జివో సంఘం ప్రకటించింది. ఒంగోలులో ఎపి ఎన్‌జివో సంఘం సభ్యులు సమావేశమయ్యారు. ఈ మేరుకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని ఎపీ ఎన్‌జివో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు తెలిపారు.

 • 09 Jan 2021 18:20 PM (IST)

  వ్యాక్సినేషన్ కోసం ఎన్నికలు ఆపొద్దుః బీజేపీ

  స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ బీజేపీ స్వాగతించింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి.. మార్పులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరిగాయని గుర్తు చేసిన బీజేపీ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరిపించాలని ఎస్ఈసీ ద‌ృష్టికి తీసుకువచ్చారు. కోవిడ్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని.. విద్యా సంస్థలు తెరిచారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస రాజు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ ముఖ్యమే అన్న ఆయన.. కానీ దాని కోసం ఎన్నికలు ఆపవద్దన్నారు.

 • 09 Jan 2021 18:15 PM (IST)

  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను కలిసిన బీజేపీ నేతలు

  ఎస్ఈసీ శుక్రవారం విడుదల చేసిన షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం విడుదలైన నోటిఫికేషన్‌లో జెడ్పీటీసీ, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల గురించి ఎటువంటి ప్రకటన లేదని ఎస్ఈసీ దృష్టికి తీసుకువచ్చిన నేతలు.. గతంలోనే అధికార పార్టీ దౌర్జన్యాల గురించి పిర్యాదు చేసామని నేతలు వెల్లడించారు.

 • 09 Jan 2021 18:09 PM (IST)

  ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఘర్షణ వాతావరణం విడనాడాలిః మధు

  ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణకు సిద్ధపడటం దురదృష్టకరమని సీపీఎం నేత మధు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఘర్షణ వాతావరణాన్ని విడనాడాలన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు వ్యవస్థలు పరస్పర సహకారంతో.. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని మధు పేర్కొన్నారు.

 • 09 Jan 2021 18:07 PM (IST)

  ఎన్నికలపై సోమవారం నాటికి స్పష్టతః ఆనం

  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ భయపడే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ 95 శాతానికిపైగా స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేని ప్రభుత్వం చెబుతున్నా ఎస్ఈసీ పట్టించుకోవడటంలేదన్న ఆయన.. నోటిఫికేషన్ విడుదలను తప్పుబట్టారు. ఎన్నికలపై సోమవారం నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావచ్చని ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.

 • 09 Jan 2021 18:03 PM (IST)

  స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నాంః చంద్రబాబు

  స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. టీడీపీ సీనియర్ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డిది వింత మనస్తత్వమని చెప్పారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అపరిచితుడు సినిమాలో లాగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

 • 09 Jan 2021 17:33 PM (IST)

  నిమ్మగడ్డ రమేష్‌ నిర్ణయం వివాదాస్పదంః అంబటి

  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ఎస్‌ఈసీకి అధికారులు వివరించినా పట్టించుకోలేదన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌ నిర్ణయం చాలా వివాదాస్పదంగా ఉందన్న ఆయన.. మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు.

 • 09 Jan 2021 17:29 PM (IST)

  వ్యాక్సినేషన్‌లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వండిః ఎస్ఈసీ

  గ్రామపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కీలక ప్రకటన చేసింది. లోకల్ బాడీ ఎన్నికల ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. ఉద్యోగులకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలని కోరింది. అలాగే ఫ్రంట్ వారియర్స్‌తో పాటు ఎన్నికల సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపింది.

   

 • 09 Jan 2021 17:24 PM (IST)

  కరోనా పరిస్థితులల్లో ఎన్నికల నిర్వహణ కష్టంః ఏపీ సర్కార్

  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఇలాంటి పరిస్థితులల్లో ఎన్నికల నిర్వహణ కష్టమవుతుందని ఏపీ సర్కార్ కోర్టుకు విన్నవించుకుంది. అలాగే, దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా షెడ్యూల్‌ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది.

 • 09 Jan 2021 17:23 PM (IST)

  హౌస్‌ మోషన్‌ పిటిషన్‌‌పై విచారణ సోమవారానికి వాయిదా

  పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

 • 09 Jan 2021 17:21 PM (IST)

  ఎన్నికల నిర్వహణపై చర్చించుకోవాలని కోర్టు సూచన

  రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని తెలిపింది. ముగ్గురు సీనియర్‌ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలోని బృందం ఎస్‌ఈసీని కలిసింది.

 • 09 Jan 2021 16:29 PM (IST)

  నిమ్మగడ్డ తీరుని తప్పుబట్టిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది

  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమేనని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇస్తుంటే, అధికారులు, సిబ్బంది మొత్తం టీకా సన్నాహక కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారని తెలిపారు. 11న మోదీ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానథ్ దాస్ వివరించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదని ద్వివేది విమర్శించారు.

 • 09 Jan 2021 16:22 PM (IST)

  ‘గజిబిజినాదం, గందరగోళం.. జగన్నాథం’ అన్నట్టుంది పాలన : బుచ్చయ్య చౌదరి

  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ లు వేసిన జగన్… ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పాలన చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ఎవరికీ అర్థం కాని రీతిలో ‘గజిబిజినాదం.. గందరగోళం.. జగన్నాథం’ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి పాలన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయలేమంటూ చెప్పడమే దీనికి తార్కాణం అని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. సంక్రాంతి ముందే వచ్చిందని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారని… “నిజమే.. మీ పేపర్ లో ప్రభుత్వ ప్రకటనల రూపంలోనూ, మీ అనుచరుల బాజా భజంత్రీల మధ్య వచ్చింది”.. అంటూ ఆయన సెటైర్లు వేశారు.

 • 09 Jan 2021 16:05 PM (IST)

  కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోండి: ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ

  ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ప్రశ్నించారు.వ్యక్తుల కోసం కాకుండా, వ్యవస్థ కోసం ఎన్నికల సంఘం పని చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా ఎలా నియంత్రణలోకి వచ్చిందనే విషయాన్ని ఎన్నికల సంఘం తెలుసుకోవాలని… ఉద్యోగులు పని చేసినందు వల్లే కరోనా కంట్రోల్ అయిందని చెప్పారు. ఎస్ఈసీ వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దని విన్నవించిన ఆయన, వ్యాక్సినేషన్ పూర్తయ్యాక లేదా కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

 • 09 Jan 2021 16:05 PM (IST)

  ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరు: ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్ బాబు

  కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ఏపీ ఉపాధ్యాయ సంఘం నేత సుధీర్ బాబు ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్ఈసీ మొండిగా నోటిఫికేషన్ ను విడుదల చేశారన్న ఆయన, రాష్ట్రంలో పాలన కుంటుపడలేదని… 9 లక్షలకు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని సుధీర్ బాబు అన్నారు.

 • 09 Jan 2021 15:48 PM (IST)

  లోకల్ ఎన్నికలను నిలుపుదల చేయాలి, లేనిపక్షంలో ఎన్నికల విధులను బహిష్కరిస్తాం : రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయంలో జగన్ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంటే, ఈ విషయంలో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు జగన్ సర్కారువైపే మొగ్గు చూపాయి. కరోనా టీకా వేయాల్సిన సమయంలో ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పినప్పటికీ… ఈసీ షెడ్యూల్ విడుదల చేయడాన్ని ఉద్యోగుల సంఘాలు తప్పుపట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. లేనిపక్షంలో తాము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.

 • 09 Jan 2021 15:33 PM (IST)

  బాబు డైరెక్షన్‌లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు : అవంతి శ్రీనివాస్

  కొవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ స్థానిక సంస్థల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నిర్ణయం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని అవంతి విమర్శలు గుప్పించారు.

 • 09 Jan 2021 15:23 PM (IST)

  రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అప్పుడెలా ఉన్నాయో, ఇప్పుడూ అలాగే ఉన్నాయి : ధర్మాన ప్రసాదరావు

  ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరును వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా పేరుతో గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ, ఇప్పుడవే పరిస్థితుల్లో ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులను ఉదాహరిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ నాడు ఎన్నికలు వాయిదా వేశారని ధర్మాన గుర్తు చేశారు. నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని, కరోనా సమయంలో ప్రజలు ఎలా ఉండాలో కేంద్రం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పుకొచ్చారు ధర్మాన. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని కొన్ని దేశాల మళ్లీ లాక్ డౌన్ కు సిద్ధమవుతుంటే ఇక్కడ ఎన్నికలు జరపనుండడం విడ్డూరంగా ఉందన్నారు ధర్మాన.

 • 09 Jan 2021 15:18 PM (IST)

  నిమ్మగడ్డ ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కులానికి కొమ్ముకాస్తున్నారు: శ్రీరంగనాథరాజు

  ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కులానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం వెనుక కుట్రకోణం ఉందని ఆయన అన్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఆపాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు వ్యవహరిస్తుంటే, ఆయన దర్శకత్వంలో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఆఖరికి కోర్టు సూచనలను కూడా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు గుప్పించారు రంగనాథరాజు.

 • 09 Jan 2021 15:13 PM (IST)

  పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలనగానే వణుకు పుట్టింది: అయ్యన్నపాత్రుడు

  కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ టీడీపీ వ్యక్తి అంటూ ఫేక్ సీఎం జగన్ రెడ్డి నోరుపారేసుకున్నాడని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది.. అందుకే పాఠశాలలు తెరిచాం.. అని చెబుతున్న ప్రభుత్వమే, ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యగానే నిమ్మగడ్డ టీడీపీ మనిషి అంటూ మరోసారి ఫేక్ ప్రచారం మొదలెట్టిందని ఆరోపించారు. అసలు విషయం ఏంటంటే..అని చెప్పుకొచ్చిన అయ్యన్న “చెత్త పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న రహస్య నివేదికలు ప్రశాంత్ కిషోర్ అందజేసాడు.. అందుకే పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి, అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడు.” అంటూ అయ్యన్న విమర్శలు గుప్పించారు.

 • 09 Jan 2021 14:56 PM (IST)

  మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్

  గుంటూరుజిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమార స్వామిని కూడా దర్శించుకుని ఆయన పూజలు చేశారు.

 • 09 Jan 2021 13:53 PM (IST)

  ఎన్నికల కోడ్ పై ఏపీ చీఫ్ సెక్రటరీకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ

  స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ పై ఏపీ చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషనర్ (ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కొంచెంసేపటి క్రితం లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కోడ్ వర్తిస్తుందని తెలిపిన ఈసీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు లబ్ది చేకూర్చే పనులు, పథకాలు చేపట్టవద్దని సూచించారు. అయితే, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు కు కోడ్ వర్తించదని తన లేఖలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు. పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వర్తించే సిబ్బందికి కరోనా నిబంధనలు ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

 • 09 Jan 2021 13:27 PM (IST)

  కేవలం11వ తేదీన జరిగే ‘అమ్మఒడి’ని ఆపడానికే ఇది చేస్తున్నారు: మోపిదేవి

  కేవలం11వ తేదీన ఏపీలో జరిగే ‘అమ్మఒడి’ కార్యక్రమాన్ని ఆపడానికే ఇది చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తాడేపల్లిలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో సంప్రదించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పినా వినకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న సందర్భంలో ఇది సరికాదన్నారు. స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన, అదే సమయంలో మళ్లీ న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

 • 09 Jan 2021 12:32 PM (IST)

  ఏపీ స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

  ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉందన్న ఆయన, ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికే బీహార్ లో, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. బ్లీచింగ్ ఫౌడర్ వేస్తే కరోనా పోతుందని చెప్పిన ముఖ్యమంత్రి జగన్, కరోనా సాకుగా చూపి ఎన్నికలను ఇప్పుడు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని బుద్దా ఎద్దేవా చేశారు.

 • 09 Jan 2021 12:05 PM (IST)

  ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ బీజేపీ, స్థానిక ఎన్నికలకు తాము రెడీనన్న అధ్యక్షుడు సోము వీర్రాజు

  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ బీజేపీ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. ఈసీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. దీనిపై మరింత ముందుకెళ్లిన ఆయన, ఇదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలంటూ కొత్త విన్నపాలు విన్నవించారు. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు 25 శాతం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుందని.. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని గతంలో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇదే అంశం అఖిలపక్ష సమావేశంలో కూడా నిమ్మగడ్డ గారికి చెప్పామన్న సోము, ఎన్నికల కమిషనర్ పంచాయతీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి పాత నోటిఫికేషన్ రద్దు చేయలేదని పేర్కొన్నారు. పాత నోటిఫికేషన్ లను రద్దు చేయాలని బీజేపీ ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తోందని సోము వీర్రాజు అన్నారు.

 • 09 Jan 2021 11:24 AM (IST)

  ‘నిమ్మగడ్డ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు చూస్తారా, లేక రాజకీయ లబ్ది చూస్తారా?’

  వ్యాక్సిన్ పంపిణీలో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యిందని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూడా ఈసీ నిమ్మగడ్డకు చెప్పారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిమ్మగడ్డ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు చూస్తారా లేక రాజకీయ లబ్ది చూస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీల ప్రలోభాలతో నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని, ఎన్నికలకు మేము భయపడే వ్యక్తులం కాదని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఎన్నికలు సరికాదని ఆయన చెప్పారు. ఈ నెల 11 న అమ్మఒడి కార్యక్రమంకు జగన్ శ్రీకారం చుట్టారని, వాటిని అడ్డుకోవడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది అంటున్నారని విమర్శించారు. ఏకపక్షంగా, దుర్మార్గంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారన్న వెల్లంపల్లి, ఇప్పటికైనా నిమ్మగడ్డ ప్రజా శ్రేయస్సు చూడాలని కోరారు. ప్రజా శ్రేయస్సుకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టీవీ9తో వెల్లంపల్లి వెల్లడించారు.

 • 09 Jan 2021 11:08 AM (IST)

  సంక్షేమ పథకాల అమలులో ఏపీ సర్కారు ముందుకు వెళ్ళకుండా రాజకీయ కుట్ర : మంత్రి వెల్లంపల్లి

  ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ హడావిడిగా స్థానిక సంస్థల ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారని ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ టీవీ9తో అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ సర్కారు ముందుకు వెళ్ళకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి హోటల్ లో ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకుని రాజకీయ పార్టీ నాయకులను కలిశారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో చెప్పలేదన్నారు. ఒక్క కరోనా కేసు కూడా లేనపుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.

 • 09 Jan 2021 09:44 AM (IST)

  ఈసీ షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు

  ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని  వెల్లడించారు. ఆపై, ఫిబ్రవరి 5, 7, 9, 17న దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని షెడ్యూల్ లో పేర్కొన్నారు.

 • 09 Jan 2021 09:40 AM (IST)

  ఫలించని చర్చలు, సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

  హైకోర్టు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేసినప్పటికీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమ నిర్ణయానికి కట్టుబడుతూ సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దీంతో జగన్ సర్కారు తాజాగా హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయాలని నిర్ణయానికి వచ్చింది.

 • 09 Jan 2021 08:52 AM (IST)

  ‘ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టలేం, కేంద్రం ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమైంది’

  ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ విజృంభిస్తోందని, దాని ప్రభావం దేశంపైనా, రాష్ట్రంపైనా ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని జగన్ సర్కారు వాదన. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికార యంత్రాంగం అంతా ఈ విధుల్లో చురుగ్గా నిమగ్నమైన తరుణంలో ఎన్నికలు నిర్వహించలేమంటోంది. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నిమ్మగడ్డ ముందే నిర్ణయించుకున్న ప్రకారం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేశారని కోర్టుకు చెప్పాలని నిర్ణయానికి వచ్చింది.