‘నడిగర్‌’లో తెలుగోడి పెత్తనమేంటి..? విశాల్‌‌పై భారతీరాజా ఫైర్

తమిళనాట నడిగర్ ఎన్నికల్లో ఈ సారి మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. విశాల్‌ను టార్గెట్ చేస్తూ తమిళ సీనియర్ నటుల కామెంట్లు.. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శరత్ కుమార్ ఫ్యామిలీ ఇప్పటికే విశాల్ తీరుపై విరుచుకుపడితే.. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా విశాల్‌పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశాడు. తమిళనాడు నిర్మాత మండలిలో ఓ పందికొక్కు దూరిందంటూ ఆయన చేసిన కామెంట్.. తమిళ సినీ పరిశ్రమలో దుమారం రేపుతోంది. అసలు తమిళ నటుల సంఘంలో ఇతర భాషల వాళ్లకు ప్రాధాన్యత ఏంటంటూ భారతీరాజా ప్రశ్నించాడు. తన ప్రాణం పోయేలోప తమిళనటుల సంఘాన్ని ఏర్పాటు చేస్తామని.. అందులో తమిళేతరులకు చోటు లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాడు. అది కాస్త వివాదాస్పదమైంది. ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య, సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాల్‌కు ట్విట్టర్‌లో బహిరంగ లేఖ రాసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. తన ఓటును కోల్పోయావంటూ ట్వీట్ చేసింది. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే గతంలో నడిగర్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించిన విశాల్ టీమ్.. ఈ సారి కూడా గెలవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ సారి విశాల్ టీమ్‌కు వ్యతిరేకంగా నటుడు భాగ్యరాజ్ బరిలోకి దిగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. భాగ్యరాజ్‌కు మద్దతుగా తమిళ సీనియర్ నటులంతా ఏకమవుతున్నారు. అసలు నడిగర్ సంఘాన్ని రద్దు చేసి.. తమిళనటుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *