ట్రైలర్ టాక్: అంతు చిక్కని సైకో.. అలుపెరగని పోలీస్ వేట!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రట్ససన్’కు ఇది తెలుగు రీమేక్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ విషయానికి వస్తే… నగరంలో 16 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలను అతి క్రూరంగా చంపుతూ.. చట్టంతో ఆడుకుంటున్న ఓ సైకోను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఓ పోలీస్ ఆఫీసర్(బెల్లంకొండ శ్రీనివాస్). అయితే అతనికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసు పెద్ద సవాల్‌గా మారుతుంది. అటు తన స్టూడెంట్‌ను కూడా సైకో అంతుచిక్కని రీతిలో చంపడంతో.. పోలీస్‌కు అండగా ఉంటూ సహాయపడుతుంది ఓ టీచర్(అనుపమ పరమేశ్వరన్). కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఆ సైకో యాంటీ సోషల్ డిజార్డర్‌తో ఇలాంటి ఘాతుకాలు చేస్తున్నాడని తెలుస్తుంది. అసలు ఆ సైకో ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.? పోలీసులకు సైకో చిక్కాడా..? లేదా అనేది తెరపై చూడాల్సిందే.

ట్రైలర్ ఆధ్యంతం సస్పెన్స్‌తో ప్రతీ సీన్ రక్తికట్టించే విధంగా ఉంది. పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. అటు అనుపమ పరమేశ్వరన్ కూడా ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ‘నేనంటే భయానికే భయం.. నన్ను పట్టుకోవాలని అనుకోకు.. పట్టుకుందాం అనుకున్నా అది నేను అవను’, ట్రైలర్ చివరిలో వచ్చే ‘బెస్ట్ అఫ్ లక్’ డైలాగులు హైలైట్‌గా నిలిచాయి.

వరుస వైఫల్యాలతో డీలాపడ్డ హీరోహీరోయిన్లుకు ఈ సినిమా సక్సెస్ ఎంతో అవసరం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ అందించిన బ్యా‌గ్రౌండ్ స్కోర్ సరిగ్గా సూట్ అయింది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *