కరువు సీమలో క్రాంతిధార బట్రేపల్లి జలధార

నెర్రెలు చాచిన బీడు భూములు,..ఎండిన బోరుబావులు,..ఎడారిని తలపించే అనంతపురం జిల్లా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆనందతీరంగా మారిపోతుంది...రాళ్లమాటున నీళ్ల జోరు మొదలువుతోంది.

కరువు సీమలో క్రాంతిధార బట్రేపల్లి జలధార
Follow us

|

Updated on: Sep 17, 2020 | 6:17 PM

నెర్రెలు చాచిన బీడు భూములు,..ఎండిన బోరుబావులు,..ఎడారిని తలపించే అనంతపురం జిల్లా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆనందతీరంగా మారిపోతుంది…రాళ్లమాటున నీళ్ల జోరు మొదలువుతోంది. ఇసుక తిన్నెల చాటున జలహోరు వినిపిస్తుంది.. ప్రకృతి వనం మధ్యలో ఆవిష్కృతమవుతున్న అద్భుతమైన బట్రేపల్లి జలపాతం ప్రకృతి ప్రేమికులను మైమరపింపజేస్తోంది.

కదిరి-పులివెందుల రహదారి పక్కన… అనంతపురం జిల్లాలో టీవలి వర్షాలకు తలుపుల మండలంలోని బట్రేపల్లి సమీపంలో కదిరి-పులివెందుల రహదారి పక్కన గల కొండలపై నుంచి జాలువారుతున్న వర్షపునీరు బట్రేపల్లి జలపాతం అటువైపు వెళుతున్న వారిని ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న అందాలు.. జలపాతం అందాలను చూడటానికి సమీప ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తున్నారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జలపాతం కొండలపై నుంచి క్షీరధారలా కిందకి దూకుతోంది.  కదిరి- పులివెందుల రహదారిపై వెళ్లే ప్రజలు సైతం కాసేపు తమ వాహనాలు ఆపి జలపాతం అందాలను తిలకిస్తున్నారు. జలపాతం వద్దకు చేరుకున్న వీక్షకులను కొండపైకి వెళ్లకూడదని అక్కడికొచ్చే ప్రకృతి ప్రేమికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఎలా వెళ్లాలి.. అనంతపురానికి 105 కిమీల దూరంలో కదిరి రేంజ్‌ ఫారెస్ట్‌లో ఉంది. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కటారుపల్లి యోగి వేమన సమాధి కూడా చూడదగిన ప్రాంతం.