బతుకమ్మ పండుగకు కరోనా ఎఫెక్ట్‌.., ఎలా నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు

పది మందితో కలిసి సరదాగా, సంబరంగా, సంతోషంగా జరపుకునేదే పండుగ.. కరోనా వైరస్‌ ఆ సరదాను కూడా లేకుండా చేసింది.. కరోనానే లేకపోయి ఉంటే ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, రంజాన్‌ పర్వదినాలను ఎంత గొప్పగా చేసుకుని ఉండేవాళ్లమో!

బతుకమ్మ పండుగకు కరోనా ఎఫెక్ట్‌.., ఎలా నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 9:39 AM

పది మందితో కలిసి సరదాగా, సంబరంగా, సంతోషంగా జరపుకునేదే పండుగ.. కరోనా వైరస్‌ ఆ సరదాను కూడా లేకుండా చేసింది.. కరోనానే లేకపోయి ఉంటే ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, రంజాన్‌ పర్వదినాలను ఎంత గొప్పగా చేసుకుని ఉండేవాళ్లమో! మరికొద్ది రోజుల్లో నవరాత్రి వేడుకలు మొదలవుతున్నాయి.. ఆపై చీకట్లను తరిమికొట్టే దీపావళి.. తెలంగాణలో దసరా వేడుకలు గొప్పగా జరుగుతాయి.. బతుకమ్మ సంబరం అయితే చెప్పనే అక్కర్లేదు. పల్లెపల్లెనా వెల్లివిరుస్తుంది.. పట్నంలో శోభిల్లుతుంటుంది.. నగరాలలో సరాగాలు పోతుంది.. అంత వైభవోపేతమైన పండుగలను జరుపుకోవడం ఎలా అన్న దిగులు పట్టుకుంది.. వాడకట్ట మహిళలంతా సామూహికంగా జరుపుకునే ఈ పండుగను కరోనా జరుపుకోనిస్తుందా? ఏమో మరి! ఎందుకంటే మలయాళీలు ఓనం పండుగను ఎంతో ఆనందంగా, ఘనంగా జరుపుకున్నారు.. ఆ పండుగ తర్వాతే కరోనా కేసులు పెరగడం కేరళ వైద్య ఆరోగ్యశాఖకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. మలయాళీలు ఎక్కడ ఉన్నా ఓనం పండుగకు సొంతూరుకు చేరుకుంటారు.. పండుగను సందడిగా జరుపుకుంటారు.. ఇలా కలిసిమెలిసి పండుగను చేసుకోవడం వల్లే కరోనా కేసులు పెరిగాయి.. ఇదంతా గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా మెలుగుతోంది.. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల వేళ కాసింత అప్రమత్తతతో మెలగమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. వినాయకచవితి ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నియమనిబంధలను పాటిస్తూ జరుపుకున్నారు.. మంటపాలు కూడా చాలా తగ్గాయి.. నిమజ్జన వేళ కూడా జాగ్రత్తలు పాటించారు.. అందుకే కరోనా అంతగా విజృంభించలేదు.. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను జరుపుకుంటే మాత్రం కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణి మొదలు పెట్టింది.. బతుకమ్మ అంటే తెలంగాణ మహిళలకు ప్రాణం.. ఎప్పుడెప్పుడు ఆ పండుగ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయా? ఆడపడచులు ఒకచోట చేరి ఆటపాటలతో ఆనందించడం కుదురుతుందా? తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఇక దీపావళి వెళ్లిన తర్వాత క్రిస్‌మస్, ఆ తర్వాత కొత్త సంవత్సరపు వేడుకలు, అటు పిమ్మట సంక్రాంతి.. వీటిపై కూడా కరోనా ప్రభావం పడే అవకాశం ఉంది.. గ్రామాలలో కూడా ఇప్పుడు కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. చలికాలంలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగించే విషయం.