ఏపీ పాలిటిక్స్‌పై బండ్ల వ్యాఖ్యలు.. జెండా, ఎజెండా లేని నాయకులెవరబ్బా..!

Bandla Ganesh sensational comments on Andhra Pradesh Politics, ఏపీ పాలిటిక్స్‌పై బండ్ల వ్యాఖ్యలు.. జెండా, ఎజెండా లేని నాయకులెవరబ్బా..!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ లైన్‌లోకి వచ్చారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి.. ప్రత్యర్థి పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసి.. తన ఫన్నీ వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు ప్రజలను తెగ నవ్వించి.. ఆ తరువాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన ఈయన.. మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ సారి ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు బండ్ల. అంతేనా.. అధికార, ప్రతిపక్షాలపై ఓరేంజ్‌లో విరుచుకుపడ్డారు.

పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందని బండ్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారని.. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ పాలనపైనా ఘాటు విమర్శలు చేశారు. వంద రోజుల పాలనలో ఏమీ చేయని సీఎం జగన్ నిద్రలేవాలి అని సూచించారు. ఇక ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే జెండా, ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని సూచించారు.  జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి అంటూ విన్నవించారు. ‘‘దగాపడ్డ తెలుగు ప్రజలారా! ఏ నాయకుడినీ నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’’ అని బండ్ల వ్యాఖ్యానించారు.

అయితే ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జగన్, చంద్రబాబు‌పై ప్రత్యక్షంగానే విమర్శించిన బండ్ల.. జెండా, ఎజెండా లేని నాయకులు అంటూ ఎవరిని ఉద్దేశించి అన్నాడా..? అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతోంది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నిర్మాతగానూ సినిమాలు తీసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *