దమ్ముంటే ఆ సమాధులను కూల్చండి.. అక్బరుద్దీన్‌కు బండి సంజయ్ సవాల్..

జీహెచ్ఎంసీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నేతల నోట మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న ఎంఐఎం నేతలు ఒక్కసారిగా తమ స్వరాన్ని పెంచడంతో.. బీజేపీ నేతలు మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 3:51 pm, Wed, 25 November 20
దమ్ముంటే ఆ సమాధులను కూల్చండి.. అక్బరుద్దీన్‌కు బండి సంజయ్ సవాల్..

జీహెచ్ఎంసీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నేతల నోట మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న ఎంఐఎం నేతలు ఒక్కసారిగా తమ స్వరాన్ని పెంచడంతో.. బీజేపీ నేతలు మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. పాతబస్తీ మా అడ్డా అని ఒకరంటుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లాంటివని మరో నేత అంటున్నారు.

తాజాగా అక్రమ కట్టడాల పేరిట పేదల ఇళ్లను కూల్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్‌‌లను సైతం కూల్చివేయాలంటూ ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ డిమాండ్ చేశారు. అయితే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘మీకు దమ్ముంటే పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చండి’ అంటూ అక్బరుద్దీన్‌కు సవాల్ విసిరారు. బల్కంపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రసంగించిన బండి సంజయ్.. ‘మీరు ఆ సమాధులను టచ్ చేసిన మరుక్షణమే దారుస్సలాంను కూల్చివేస్తాం’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును కూడా సంజయ్ తూర్పారబట్టారు. పాతబస్తీకి పోవాలంటే సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. ‘సీఎం కేసీఆర్ పాతబస్తీ రావాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలని చార్మినార్ ఎమ్మెల్యే అంటున్నారు. ఆ వ్యాఖ్యలే కేసీఆర్ భయపడుతున్నారని చెప్పడానికి నిదర్శనం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ లాంటివని, బీజేపీని గెలిపిస్తే ఇండియాను గెలిపించినట్లేనని సంజయ్ వ్యాఖ్యానించారు.

ఇక ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్‌గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను ఎలా ఆడించాలో తమకు బాగా తెలుసునని, తాము ఎవరి కాళ్ల కింద ఉండాల్సిన అవసరం లేదంటూ పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, అక్రమ కట్టడాల పేరిట పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.