అయోధ్యలో రామ్‌లీలా ఉత్సవాలు.. రామాయణ కావ్యంలో నటించనున్న తారలు

అయోధ్య నగరం సుందరీకరణ పనులు మొదలయ్యాయి.. రామమందిరానికి భూమి పూజ జరిగినప్పటి నుంచే పనులు వేగాన్ని సంతరించుకున్నాయి.. ఆధ్యాత్మికశోభతో అలలారుతోన్న అయోధ్యలో ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయోధ్యలో రామ్‌లీలా ఉత్సవాలు.. రామాయణ కావ్యంలో నటించనున్న తారలు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 12:47 PM

అయోధ్య నగరం సుందరీకరణ పనులు మొదలయ్యాయి.. రామమందిరానికి భూమి పూజ జరిగినప్పటి నుంచే పనులు వేగాన్ని సంతరించుకున్నాయి.. ఆధ్యాత్మికశోభతో అలలారుతోన్న అయోధ్యలో ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈసారి జరిగే రామ్‌లీలా ఎంతో ప్రత్యేకమైనది.. రామాలయానికి శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతున్న వేడుక ఇదే కాబట్టి గొప్పగా జరపాలని నిర్వాహక కమిటీ ఆలోచన!

ఇందుకోసం భోజ్‌పురి సినీనటుడు, గోరక్‌పూర్‌ ఎంపీ రవి కిషన్‌, ఢిల్లీ బీజేపీ ఎంపీ, నటుడు గాయకుడు మనోజ్‌ తివారి, నటుడు విందు దారాసింగ్‌, సీనియర్‌ నటుడు రాజా మురాద్‌, అవతార్‌ గిల్‌, సుప్రసిద్ధ హాస్యనటుడు అస్రానీలు రామ్‌లీలా వేడుకల్లో పాల్గొనబోతున్నారు.. రంగస్థలం మీద ప్రదర్శించే రామాయణంలో వీరు పాత్రధారులు కాబోతున్నారు.. సీతారాముల వేషాలు మాత్రం స్థానిక కళాకారులే ధరిస్తారు.. రవి కిషన్‌ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే! ఈయన రాముడి సోదరుడు భరతుడి పాత్రను పోషిస్తాడు. మనోజ్‌ తివారి అంగదుడి పాత్రను ధరిస్తాడు.

అందరూ ఊహించినట్టుగానే విందు దారాసింగ్‌ హనుమంతుడి వేషం కడతాడు.. ఒకప్పడు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన రామానంద్‌సాగర్‌ రామాయణం సీరియల్‌లో హనుమంతుడి పాత్రలో ఈయన తండ్రి దారాసింగ్‌ అద్భుతంగా నటించిన సంగతిని ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రకాంత సీరియల్‌ ఫేమ్‌ షాబాజ్‌ఖాన్‌ రావణుడి పాత్రలో రాణించబోతున్నాడు.. రాజా మురాద్‌ అహిరావణ్‌ పాత్రను.. నారదుడి వేషాన్ని అస్రానీ వేయబోతున్నారు. రామాయణంలో నటించడం వీరికి కొత్తేమీ కాదు.. కొన్నాళ్లుగా ఢిల్లీలో జరిగే రామ్‌లీలా ఉత్సవంలో వీరంతా నటిస్తూ వస్తున్నారు.. ఢిల్లీలో జరిగే రామాయణ నాటకంలో మాత్రం రావణుడి పాత్రను అవతార్‌ గిల్‌ వేస్తూ వస్తున్నాడు.

అయోధ్యలో రామలీలా ఉత్సవాలు అక్టోబర్‌ 17 నుంచి మొదలవుతాయి.. 25 వరకు జరిగే ఈ నవరాత్రి వేడుకల్లో అనేక జనరంజక కార్యక్రమాలు జరుగుతాయి.. రావణుడుపై రాముడు సాధించిన విజయానికి సంకేతంగానే విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం.. ఆ దసరా రోజునే రంగస్థలంపై రామాయణాన్ని ప్రదర్శిస్తారు. అయోధ్యలో జరగే రామ్‌లీలా ఉత్సవాలను నభూతో న భవిష్యతి అన్న రీతిలో జరిపేందుకు తాము శతవిధాల ప్రయత్నిస్తున్నామని రవి కిషన్‌ చెప్పుకొచ్చారు.. చిన్నప్పటి నుంచే రామ్‌లీలా ఉత్సవాలపై ఆసక్తి పెంచుకున్నానన్నాడు. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయోధ్యలో రామ్‌లీలా వేడుకలను పునరుద్ధరించారు. 2004లో అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ రామ్‌లీలా ఉత్సవాలను ప్రారంభించారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆయన కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ సీఎం అయ్యాక రామ్‌లీలాను ఆపేశారు.

శ్రీరాముడు జన్మించడం వల్లే అయోధ్య నగరానికి ఓ పవిత్రత చేకూరింది.. ఇప్పుడు ఆ నగరం రాముడి పట్టణంగా భాసిల్లబోతున్నది.. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌ పర్యాటకశాఖ చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసింది.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. రాముడి మ్యూజియం, రాముడి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. కళ తప్పిన రామ్‌లీలా ఉత్సవాలను తాము ఇప్పడు కొత్త సొబగులను అద్దుతామంటున్నారు ప్రభుత్వ ప్రతినిధులు..