చిట్యాల ఎంపీపీపై హత్యయత్నం.. 9 మంది అరెస్ట్

నల్గొండ జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై మంగళవారం అర్ధరాత్రి కిరాయి హంతకులు దాడి చేశారు.

చిట్యాల ఎంపీపీపై హత్యయత్నం.. 9 మంది అరెస్ట్
Follow us

|

Updated on: Sep 16, 2020 | 12:20 PM

నల్గొండ జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై మంగళవారం అర్ధరాత్రి కిరాయి హంతకులు దాడి చేశారు. ఈ ఘటన చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు కార్లలో రావడంతో అనుమానం వచ్చి స్థానికులు ముఠాను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన పాత నేరస్థునితో సహా 9 మందిని అదుపులోకి తీసుకోగా మరో 15 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పేరేపల్లికి చెందిన కొలను వెంకటేశ్‌, అదే గ్రామానికి చెందిన అంతటి వెంకటేశ్‌ గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే ఇద్దరు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. కాగా, కొలను వెంకటేశ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో అంతటి వెంకటేశ్‌ చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొలను వెంకటేశ్‌ భార్య సునీత పోటీ చేసి గెలిచి చిట్యాల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది జీర్ణించుకోలేని అంతటి వెంకటేశ్‌ కొలను వెంకటేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాగా, మంగళవారం ఎంపీపీ సునీత భర్త వెంకటేశ్‌ పుట్టినరోజు పురస్కరించుకొని వేడుక నిర్వహించేందుకు కుటుంబసభ్యులతో కలిసి పేరేపల్లికి వచ్చారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న అంతటి వెంకటేశ్‌ అనుచరుడు జగన్‌ వారిని హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. ఇదే సరైన సమయమని భావించి హైదరాబాద్‌ నుంచి 15 మంది కిరాయి హంతకులను నాలుగు కార్లలో రప్పించాడు. అయితే రౌడీలు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కుటుంబసభ్యులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించిన రౌడీలలో 9 మందిని స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.