గృహహింస చట్టంతో మహిళలకు న్యాయం జరుగుతుందా…?

గతంలో ఆలు, మగలు మధ్య గొడవలు వస్తే ఏం చేసేవాళ్లు. ఇంట్లో పెద్దలు, ఊళ్లో వాళ్లు పిలిచి మాట్లాడేవాళ్లు. ఎవరిది తప్పు ఉంటే వారిని గట్టిగా అరిచేవాళ్లు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించే వాళ్లు. వారి భయంతో పద్దతిగా కాపురం చేసుకునే పరిస్థితి ఉండేది. కాలం మారింది. ఆస్తులు, అంతస్థుల కోసం, కట్నం, కానుకల కోసం, మరికొన్నికారణాలతో ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అన్నదమ్ములు కలిసి ఉండటం లేదు. అంతెందుకు తల్లిదండ్రులతోనే తమ పిల్లలు పెళ్లయ్యాక ఉండటం లేదు. […]

గృహహింస చట్టంతో మహిళలకు న్యాయం జరుగుతుందా...?
Follow us

|

Updated on: Jan 06, 2020 | 6:05 PM

గతంలో ఆలు, మగలు మధ్య గొడవలు వస్తే ఏం చేసేవాళ్లు. ఇంట్లో పెద్దలు, ఊళ్లో వాళ్లు పిలిచి మాట్లాడేవాళ్లు. ఎవరిది తప్పు ఉంటే వారిని గట్టిగా అరిచేవాళ్లు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించే వాళ్లు. వారి భయంతో పద్దతిగా కాపురం చేసుకునే పరిస్థితి ఉండేది. కాలం మారింది. ఆస్తులు, అంతస్థుల కోసం, కట్నం, కానుకల కోసం, మరికొన్నికారణాలతో ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అన్నదమ్ములు కలిసి ఉండటం లేదు. అంతెందుకు తల్లిదండ్రులతోనే తమ పిల్లలు పెళ్లయ్యాక ఉండటం లేదు. ఎవరికి వారే వేరు కాపురం. చెప్పే వాళ్లు లేక చెడిపోవడం అంటే ఇదేనేమో. చిన్న చిన్న విషయాలకే గొడవలు. కోట్లాటలు. కోపాలు, తాపాలు పెరుగుతున్నాయి. కొన్ని సార్లు అవి శృతి మించుతున్నాయి. భౌతిక, లైంగిక దాడులకు దారి తీస్తున్నాయి. హత్యలు, ఆత్మహత్యల పరంపర పెరిగింది. హింస, కేసులు, కోర్టుల చుట్టూరా తిరగడం ఇప్పుడు సాధారణవుతోంది. ఫలితంగా నిండు జీవితాలు నాశనమవుతున్నాయి. మొత్తంగా గృహ జీవితం నరకమయమవుతోంది. గృహిహింస చట్టం అమలులోకి వచ్చిన నేడు వాస్తవ పరిస్థితి పై చర్చిద్దాం…

ఉమ్మడి కుటుంబాలు లేక మహిళలు ఎన్నో ఆంక్షలు, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. స్త్రీల ఆకాంక్షలు, ఆలోచనలకు విలువ ఉండటం లేదు. పెళ్ళయి, పుట్టి పెరిగిన ఇంటిని వదిలిపెట్టి, అత్తింట అడుగుపెట్టిన కోడలికి ఆరళ్ళు స్వాగతం చెబుతున్నాయి. ఇంటి గుట్టు బయట పెట్టకూడదంటూ అత్తింట, ఎన్ని బాధలు పడ్డా మౌనంగా భరించాలి తప్ప ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగేవన్నీ వ్యక్తిగతమైనవి. భార్యని కొట్టినా తిట్టినా భర్తదే హక్కు అనే ప్రచారం ఉండేది. ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేముందు ఇలాంటి నీతుల్ని తల్లిదండ్రులు బోధించి పంపుతారు. అందుకే భర్త ఏం చేసినా సంసారం పట్టించుకోకపోయినా భార్య మౌనంగా భరిస్తుంది. కుటుంబంలో ఎంత భయంకరమైన హింస జరిగినా, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా సరే స్త్రీలు బయటకు రాకుండా హింసను అనుభవిస్తున్నారు.

గృహ హింస నిరోధక చట్టం…

ఇలా కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. దానికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా వచ్చిందే గృహ హింస నిరోధక చట్టం 2005. జమ్ము కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం కిందకు వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్త్రీలకు) ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబంలోని వారు భర్త, బావ, మరిది, అన్నదమ్ములు, మామ, కొడుకు, అల్లుడు,తండ్రి వంటి వారు జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం వచ్చింది. మహిళలకు ఎక్కడైతే రక్షణ లేదో, హింసకు గురవుతుందో అక్కడినుంచే చట్టం సహాయంతో పోరాటం సాగించే హక్కు వచ్చింది. అంటే స్త్రీకి స్థానబలం కల్పించింది. ఇది గొప్ప వెసులుబాటు.

ఇది ఒక సివిల్‌ చట్టం. వైవాహిక జీవితంలో అంటే సున్నితమైన బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్‌ కుటుంబ పెద్దగా నిందితుల తప్పును ఎత్తిచూపుతారు. దాన్ని సరిదిద్దుకోమని సూచించి, భార్యా పిల్లల్ని, తల్లిని లేదా మహిళలను సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించే అధికారం వచ్చింది. దాన్ని అమలు పరచకపోతే రక్షణ ఉత్తర్వుల ధిక్కారం కింద నేరంగా పరిగణించి, శిక్షించే అధికారం కల్పించింది ఈ చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు, పిల్లలు (18 సం||లలోపు) న్యాయం పొందవచ్చు.

ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురైతే కుటుంబ హింస కిందికి వస్తుంది. శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం. మొత్తంగా శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి. బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు అన్నీ లైంగిక హింస కిందకి వస్తాయి. అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్న బుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసిస్తానని అదేపనిగా బెదిరించడం ఇవన్నీ మానసిక హింస కిందకు వస్తాయి. మహిళ మనసును నొప్పిస్తూ, క్షోభకు గురి చెయ్యడం నేరమే. కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకివ్వకపోవడం, చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం, సాంప్రదాయంకానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా గానీ ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం, స్త్రీ ధనం దక్కకుండా చూడటం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటి నుంచి బయటకు పంపడం, ఆమె ఆదాయాన్ని తీసుకోవడం, అదనపు కట్నం తెమ్మని వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస లేదా వేధింపుల కిందకు వస్తాయి. మహిళలకు లేదా పిల్లలకు సంబంధించి ఆ కుటుంబంలో మగవారి ద్వారా జరిగే ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా గృహహింస అవుతుంది. భర్తే కాకుండా ఇతర సంబంధీకుల ద్వారా అలా హింసకు గురైనా ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది.

మహిళలు ఏం చేయాలంటే… కుటుంబంలో శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ చేకూర్చుతోంది ఈ చట్టం. బాధిత మహిళలకి అవసరమైన సంస్థలు, సహాయం చేసే సంస్థలూ, వ్యక్తులూ వున్నారు. బాధితురాలికి చట్టపరమైన సహాయం గురించి ఉచిత న్యాయసేవలు, ఆర్థిక సహాయం గురించి, పిల్లల కస్టడి గురించి, ఆశ్రయం అందించే సంస్థల గురించి, వైద్యసహాయం గురించి, ఇతర సేవలను గురించి సమాచారం పొందే హక్కు ఉంది. పై సమాచారాలను బాధితురాలికి అందజేయడం రక్షణాధికారుల బాధ్యత. ఏదైనా ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతున్నట్లు లేదా జరిగే ప్రమాదం ఉన్నట్లు బాధితురాలి నుండి గానీ మరే ఇతర వ్యక్తి నుండి గానీ నిర్దిష్టమైన సమాచారాన్ని రాత పూర్వకంగా కానీ, మాట ద్వారా కానీ అందినపుడు దానిని రక్షణాధికారి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. రాతపూర్వకంగా కాక నోటి మాటగా ఇచ్చిన సమాచారాన్ని రక్షణాధికారి తానే పేపర్‌పై రాసి సమాచారాన్ని ఇచ్చినవారి సంతకం తీసుకోవాలి. వారి వివరాలు తీసుకుని జాగ్రత్త చేయాలి.

కుటుంబ హింస జరుగుతున్నట్లు, లేదా జరగబోతున్నట్లు సమాచారం వస్తే పోలీసుల సహాయం తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి కుటుంబ సంఘటన నివేదిక తయారు చేసి, తగిన ఆదేశాల కోసం వెంటనే మెజిస్ట్రేటు ముందు దాఖలు చేయాలి. ఈ సమాచార పత్రం కాపీని సమాచారం అందించిన వ్యక్తికి ఉచితంగా ఇవ్వాలి. కుటుంబ హింసకు గురైన బాధితురాలికి ఆమెకు గల హక్కుల గురించి, గృహహింస నిరోధక చట్టంలోని వెసులుబాట్ల గురించి వివరించాలి. ఒకవేళ బాధితురాలి శరీరంపై గాయాలు, దెబ్బలు వుంటే వెంటనే ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి, ఆ పరీక్షల నివేదిక కాపీలను కుటుంబ హింస జరిగిన ప్రాంతపు పోలీసు స్టేషనుకు, మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఈ చట్టం క్రింద గుర్తించిన ఆసుపత్రుల వైద్యాధికారులతో మాట్లాడి బాధితురాలికి, ఆమె పిల్లలకు అవసరమైతే వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులకు వెళ్ళేందుయ్యే రవాణా ఖర్చులను రక్షణాధికారులే భరించాలి.

ప్రభుత్వాల పాత్ర ఏంటి…

బాధితురాలికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా రాష్ట్ర న్యాయసేవల సహాయ సంస్థ ద్వారా రక్షణాధికారి ఇప్పించాలి. బాధితురాలు ఆశ్రయం కోరితే ఆమెను, ఆమె పిల్లలను ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్‌ హోమ్‌లో ఉంచి, ఆ సమాచారాన్ని ఆ ప్రాంత పోలీసు స్టేషన్‌కు, మేజిస్ట్రేట్‌కి రక్షణాధికారి చెప్పాలి. కుటుంబ హింస జరిగినట్లు సమాచారం అందిన తక్షణం రక్షణాధికారి, చట్టంలో నిర్దేశించిన విధంగా కుటుంబ హింస సంఘటన నివేదికను తయారు చేసి మేజిస్ట్రేటుకు ఇవ్వాలి. ఈ నివేదిక కాపీలను ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్‌కి, సర్వీస్‌ ప్రొవైడర్‌కి అందజెయ్యాలి.

ఈ చట్టానికి అనుగుణంగా కుటుంబ హింసను అరికట్టేందుకు సహాయక సంస్థలు, వాటిలోని సభ్యులు సదుద్దేశంతో ఏ పని చేసినా, చేయబోయినా ఆ సంస్థపై, ఆ సంస్థలోని సభ్యులపై ఏవిధమైన దావాలు ప్రాసిక్యూషన్‌ మరే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే వీలు లేదని కోర్టు చెబుతోంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న ఏ దశలోనైనా బాధితురాలిని, ప్రతివాదిని లేదా ఇద్దరిని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు. ఈ కౌన్సిలింగ్‌ చేసే వ్యక్తికి ఇరుపక్షాలతో ఎలాంటి సంబంధమూ ఉండరాదు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ తుది తీర్పు వెలువడే లోపు జరగాలి. కుటుంబంలో జరుగుతున్న హింసని ఆపుచేసే ఆదేశం వెంటనే యివ్వగలిగితే బాధిత మహిళ కొంత ఉపశమనం పొందగలుగుతుంది.

ఈ చట్టం కింద చాలా రకాల సంఘటనలని/వేధింపులను కోర్టు నిలుపుదల చేసే అవకాశం ఉంది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష గాని, రూ. 20000 జరిమానా గాని, రెండింటిని గానీ విధించవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్‌ 19 (5), 19 (7) ప్రకారం బాధితురాలి ఇంటి నుండి ప్రతివాదిని ఖాళీ చేయించడంలోనూ, బాధితురాలి ఇంటి వాటాకి ప్రతివాదిగాని, అతని తరపునవారు గాని ప్రవేశించకుండా కోర్టు ఆదేశించినా, కలిసివున్న ఇంటిని అమ్మకుండా ఆదేశాలు జారీ అయినా, వీటిని అమలు చేయడంలో పోలీసులు సహకరించాలి. ఇంత మంచి చట్టం అమలులోకి వచ్చి చాలా ఏళ్లు అయినా అమలు తీరు అనుకున్నంత ఆశాజనకంగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో రక్షణాధికారుల నియామకం జరగలేదు. ఫలితంగా గృహ హింస నిరోధక చట్టం వచ్చినా…అనుకున్నంత మేర స్త్రీకి న్యాయం జరగడం లేదు. అందుకే ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్చంథ సంస్థలు, మీడియా తమ వంతుగా ఈ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అమలు తీరులో లోపం లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9