హవ్వ ! చంద్రబాబు ఇంటిగేట్లను తాళ్లతో కట్టేశారు.. ఇదెక్కడి చోద్యం ?

Former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, హవ్వ ! చంద్రబాబు ఇంటిగేట్లను తాళ్లతో కట్టేశారు.. ఇదెక్కడి చోద్యం ?

ఏపీలో జగన్ ప్రభుత్వం తనను, తమ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభివర్ణించిన ఆయన.. పోలీసుల చర్య అతి హేయమైనదని, చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. ఈ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఈ సర్కారునే కాక పోలీసులను కూడా హెచ్చరిస్తున్నానని ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అరెస్టుల ద్వారా మమ్మల్ని ఆపలేరు అన్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు ఉండవల్లిలోని తన ఇంటిగేటుకు చేరుకోవడానికి అరగంట ముందే.. వ్యూహం ప్రకారం పోలీసులు ఆ రోడ్డుపై బ్యారికేడ్లు కట్టేశారు. పైగా ఆయన ఇంటిగేటు తెరచుకోకుండా తాళ్లతో కట్టేశారు. దానికి వరుసబెట్టి ముడులు వేశారు. దీంతో వందలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు, మీడియా జర్నలిస్టులు గేటు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. తన ఇంటి ప్రాంగణంలో అప్పటికే చేరుకున్న మీడియాతో బాబు మాట్లాడుతూ.. ఏపీ అంతటా తమ పార్టీ కార్యకర్తలను అణచివేయడానికి ఈ ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా మేం ఆందోళన చేయడానికి పూనుకొంటే మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కాగా-వైసీపీ నేతలు బాహాటంగానే తమ వారిని బెదిరిస్తున్నారని, పోలీసులు తమతోనే ఉన్నారని అంటున్నారని చంద్రబాబు కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కూడా అయిన లోకేష్ ఆరోపించారు. అటు-ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబును, ఆయన పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. టీడీపీ వారి ఆందోళన కారణంగా పల్నాడులో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన చెప్పారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *