కమలం గూటికి మరో టీఆర్ఎస్ సీనియర్ నేత… కాషాయం కండువా కప్పుకోనున్న స్వామిగౌడ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా వ్యూహలకు పదునుపెట్టింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలకు గాలం వేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 3:49 pm, Wed, 25 November 20
కమలం గూటికి మరో టీఆర్ఎస్ సీనియర్ నేత... కాషాయం కండువా కప్పుకోనున్న స్వామిగౌడ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా వ్యూహలకు పదునుపెట్టింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలకు గాలం వేసింది. ఇప్పటికే కొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకోగా మరికొందరికి కాషాయం కండువా కప్పేందుకు రెఢీ అవుతోంది. తాజాగా శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారు.

అయితే, టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు సమావేశమవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేత స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అలాంటిది గత కొద్దిరోజులుగా గులాబీ దళంపై గుర్రుగా ఉన్న స్వామిగౌడ్.. సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చి.. బీజేపీ గూటికి చేరతున్నారు.

అయితే, బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంపై స్వామిగౌడ్ స్పష్టత ఇవ్వలేదు. టీఆర్ఎస్‌లోనే ఉంటానని గానీ.. బీజేపీలోకి వెళ్తున్నానని గానీ చెప్పలేదు. ఇది స్నేహపూర్తక కలయిక అని.. మిత్రులతో కూడా మాట్లాడవద్దా.. అని మీడియాను ఎదురు ప్రశ్నించారు స్వామిగౌడ్. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తెలియజేస్తానని వెల్లడించారు. అటు లక్ష్మణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని..రాజకీయాలు కూడా చర్చించామని చెప్పారు. ఒకవేళ స్వామిగౌడ్ బీజేపీలో చేరితే మీడియాకు చెబుతామని తెలిపారు లక్ష్మణ్. కాగా, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గులాబీ వదిలి కమలం గూటికి చేరుతున్నారు స్వామిగౌడ్.

ఇదిలావుంటే, గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు అశించి భంగపడ్డ వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు నగర నాయకులు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కాగా, భవిష్యత్తులో అనేకమంది పార్టీలోకి వస్తారని, అందరికి కలుపుకొని పార్టీని మరింత బలేపేతం చేస్తామని తెలంగాణ బీజేపీ చీప్ బండి సంజయ్ చెబుతున్నారు.