‘జూ’ లోని పులులుకు బీఫ్ వద్దంటున్న బీజేపీ నేతలు

అస్సాంలో బీజేపీ నేతల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. జూ ప్రాంగణంలోకి గొడ్డు మాంసం తీసుకెళ్తున్న వ్యాన్ అడ్డుకున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:38 pm, Tue, 13 October 20

అస్సాంలో బీజేపీ నేతల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. జూ ప్రాంగణంలోకి గొడ్డు మాంసం తీసుకెళ్తున్న వ్యాన్ అడ్డుకున్నారు. దీంతో స్థానికులు, జూ అధికారులు వ్యతిరేకించడంతో తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.

జంతువులకు గొడ్డు మాంసం సరఫరాను నిలిపివేయాలంటూ అస్సాం బిజెపి నేత సత్య రంజన్ బోరా నాయకత్వంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గుహతిలోని స్టేట్ జూ వెలుపల ప్రదర్శన చేపట్టారు. ఇంతలో అటుగా వచ్చిన గొడ్డు మాంసం వ్యాన్ కూడా జూ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. జూ అధికారులు, అస్సాం ప్రభుత్వం గొడ్డు మాంసం ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని బోరా హెచ్చరించారు. అయితే, జంతువులకు ఇవ్వవలసిన ఆహారంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, సెంట్రల్ జూ అథారిటీకి తమ డిమాండ్లను పంపాలని జూ అధికారులు నిరసనకారులను కోరారు.

అయితే, జంతువుల అవసరాలు, ఆహారపు అలవాట్ల ప్రకారం తినిపిస్తారు. వాటిపై అధ్యయనాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు. ఆందోళనకారుల డిమాండ్ ప్రకారం CZA జంతువుల ఆహారాన్ని సవరించినట్లయితే, జంతుప్రదర్శనశాల అధికారులు దీనిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారని అస్సాం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

గొడ్డు మాంసం, ఇతర రకాల మాంసాన్ని సాధారణంగా పులులు, సింహాలకు ఇస్తుంటారు. ఇతర అడవి జంతువులు వాటి పోషకాహార అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లాబైడియా అన్నారు. ప్రతి జంతువుకు భిన్నమైన ఆహారపు అలవాటు ఉంది. మేము దానిని చూసుకోవాలి. మేము దానిని భంగం చేస్తే జూ అధికారులకు సమస్యాత్మకంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు.