యాపిల్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయ్…

ఐఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 వచ్చేసింది. యాపిల్ నుంచి 5G నెట్‌వర్క్‌ సౌకర్యం కలిగిన ఐఫోన్స్ మార్కెట్‌లోకొచ్చేశాయ్.

యాపిల్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయ్...
Follow us

|

Updated on: Oct 14, 2020 | 7:06 PM

ఐఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 వచ్చేసింది. యాపిల్ నుంచి 5G నెట్‌వర్క్‌ సౌకర్యం కలిగిన ఐఫోన్స్ మార్కెట్‌లోకొచ్చేశాయ్. అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాపిల్‌ కార్యాలయం యాపిల్ పార్క్‌లో జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో యాపిల్ సంస్థ ఐఫోన్‌ 12 సిరీస్‌ కింద నాలుగు మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొ, ఐఫోన్‌ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్‌ 12 మినీని యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ కూడా అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ పరిజ్ఞానం ఉన్న మిల్లిమీటర్ వేవ్ 5Gని సపోర్ట్ చేస్తాయని యాపిల్ ప్రకటించింది. ఈనెల 30 నుంచి భారత్‌లో వీటి అమ్మాకాలు మొదలు కానున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది.

దీంతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ల ధరలను కంపెనీ కాస్త తగ్గించింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 11 ఎంఆర్‌పీ ధరలను సవరించి.. కొత్త ధరల వివరాలను యాపిల్ ఇండియా తమ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఉంచింది. అయితే, ఐఫోన్లతో పాటు వచ్చే ఛార్జర్‌, ఇయర్‌పాడ్స్‌ను మాత్రం తీసివేస్తూ కొత్త ప్యాక్ ను మార్కెట్ లోకి తెచ్చింది యాపిల్‌. ఇకపై ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే అందులో ఐఫోన్‌తోపాటు కేవలం ఛార్జింగ్‌ కోసం కేబుల్‌ కనెక్టర్‌ మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐఫోన్‌ 12ను ఛార్జర్‌, ఇయర్‌పాడ్స్‌ లేకుండానే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది.

ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్ఆర్ ‌64జీబీ ధర రూ. 52,500 ఉండగా.. రూ. 47,900కు తగ్గించింది. ఐఫోన్‌ ఎస్‌ఈ 2020 మోడల్ 64 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 42,500 ఉండగా, ఇకపై రూ. 39,900 లభించనుంది. అలాగే, 128జీబీ వేరియంట్‌ రూ. 47,800 నుంచి రూ. 44,900కి, 256జీబీ వేరియంట్‌ రూ. 58,300 నుంచి రూ. 54,900కి తగ్గించారు. ఇక, ఐఫోన్‌ 11 ధర రూ. 13 వేలకు పైగా తగ్గడం విశేషం. ప్రస్తుతం ఐఫోన్‌ 11 ధర రూ. 68,300 లభిస్తుండగా.. ఇకపై రూ. 54,900కే దక్కనుంది. దీపావళి పండగ సందర్భంగా ప్రత్యేకంగా ఐఫోన్‌ 11కి ఇయర్‌పాడ్స్‌ జత చేసి అక్టోబర్‌ 17 నుంచి విక్రయించాలని యాపిల్ నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే, తగ్గించిన ధరలను యాపిల్ ఆన్‌లైన్‌ స్టోర్లలో కొన్నవారికే మాత్రమే వర్తిస్తాయని సంస్థ తెలిపింది.