ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యాశాఖ గతంలో ఇచ్చిన..

  • Ravi Kiran
  • Publish Date - 2:08 pm, Tue, 24 November 20

AP Schools Re-Open: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యాశాఖ గతంలో ఇచ్చిన జీవోలో పలు సవరణలు చేసి తాజాగా జీవో నెంబర్ 229ను విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు తగినంత స్థలం లేనందున ఈ మేరకు జీవోలో మార్పులు చేసినట్లు ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక జీవో ప్రకారం డిసెంబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్, పాఠశాలల్లో 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు ప్రారంభించనున్నారు. అలాగే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని పరిశీలించి తర్వాతే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అటు పదో తరగతి విద్యార్ధులకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే 8,9 తరగతుల విద్యార్ధులకు రోజూ మార్చి రోజు క్లాసులు జరుగుతాయని చెప్పారు.

కాగా, సోమవారం నుంచి ఏపీవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్ధులకు క్లాసులు ప్రారంభమైన సంగతి విదితమే. తొలి రోజే సుమారు 69.72 శాతం మంది విద్యార్ధులు క్లాసులకు హాజరైనట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్ధులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు.