ప్రాణమున్నంతవరకు జగన్‌తోనే ఉంటా..మంత్రి కొడాలి నాని

గుడివాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత సీఎం  ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) జిల్లాలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. గుడివాడ రాజకీయంలో ఆయన ఒక సంచలనం. అందరికి అందుబాటులో ఉండటం..కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లడం..అధినేత మాటను జవదాటని నైజం కొడాలి నానిని మంత్రిని చేశాయి.

నెరవేరిన గుడివాడ ప్రజల కల
గుడివాడ ప్రజల కల నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి చోటు దక్కటంతో నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గం ఏర్పడ్డాక 25 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి కఠారి ఈశ్వర్‌కుమార్‌ మంత్రిగా పని చేయగా అనంతర కాలంలో గుడివాడ నుంచి మంత్రిగా పనిచేసిన వారు లేరు.

తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కొడాలి నాని రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. మొదట్లో ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిగా ఉంటూ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు.  తెలుగుదేశం పార్టీ తరపున 2004లో అనూహ్యంగా టిక్కెట్టు దక్కించుకోవటమే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో గుడివాడలో రావి కుటుంబానికి స్థానం లేకుండా చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. అనంతరం 2013లో వైఎస్సార్‌ సీపీలోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైఎస్సార్‌సీపీ తరపున గెలుపొందారు. గుడివాడ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు తిరుగులేని నేతగా కొడాలి నాని సత్తాను చాటుకున్నారు.

తనకు మంత్రి ఇవ్వడం పట్ల ఏపీ సీఎం జగన్‌కు..మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు. తానెప్పుడూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాని..మంత్రి పదవులు ఆశించలేదన్నారు. సీఎం ఇచ్చిన మినిష్ట్రీని భాధ్యతగా భావించి..మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపారు. తన ప్రాణమున్నంతవరకు జగన్ మోహన్ రెడ్డి పక్కనే ఉంటానని..ఎప్పుడూ  వైసీపీ జెండా ఎగిరేందుకు కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *