వేగంగా విస్తరిస్తున్న డ్రోన్‌ మార్కెట్..అనంతపురం జిల్లాలో భారీ డ్రోన్‌ సిటీ నిర్మించడానికి ప్రణాళికలు

డ్రోన్‌ సిటీలో భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా 38 కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలను ఎంపిక చేస్తున్నట్లుగా తెలిపారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:35 pm, Fri, 20 November 20

Drone City In Anantapur : వేగంగా విస్తరిస్తున్న డ్రోన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ సర్కార్ప్ర త్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం అనంతపురం జిల్లాలో భారీ డ్రోన్‌ సిటీ నిర్మించడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది.

అంతర్జాతీయ సంస్థలు డ్రోన్‌ తయారీ, పరిశోధన అభివృద్ధి, పరీక్ష కేంద్రాలను ఒకేచోట ఏర్పాటు చేసే విధంగా 360 ఎకరాల్లో భారీ డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వి.ఎన్‌.భరత్‌రెడ్డి తెలిపారు.

ఈ డ్రోన్‌ సిటీలో భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా 38 కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలను ఎంపిక చేస్తున్నట్లుగా తెలిపారు.

ఇప్పటికే అనంతపురంలో కంటికి కనిపించనంత దూరంగా డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతి ఇవ్వడంతో ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు అనంతపురాన్ని శాశ్వత డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంపై దృష్టిపెడుతున్నామని అన్నారు. దీనికోసం పుట్టపర్తి విమానాశ్రయాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.

దేశంలో తొలిసారిగా అనంతపురం జిల్లాలో డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేసి డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ బరువును తీసుకువెళ్లే వాటి దగ్గర నుంచి వ్యవసాయరంగంలో వినియోగించేందుకు 250 కిలోల బరువును మోసుకెళ్లే డ్రోన్ల వరకు తయారీకి ఈ డ్రోన్‌ సిటీ వేదిక కానుంది.