ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.6,400 కోట్ల టెండర్లు రద్దు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టులను రద్దు చేసింది ఏపీ సర్కార్.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.6,400 కోట్ల టెండర్లు రద్దు..!
Follow us

|

Updated on: Sep 20, 2020 | 2:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టులను రద్దు చేసింది ఏపీ సర్కార్. దాదాపు రూ.6,400 కోట్ల నిధులతో 3 వేల కిలో మీటర్ల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత‌ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్‌కు వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. వారం రోజుల్లో కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికావల్సిన పనిలేదన్న కృష్ణబాబు.. ఎన్డీబీ ద్వారా చేపట్టిన పనులను 26 ప్యాకేజీలుగా పిలిచామనీ.. మరింత మందికి అవకాశం కల్పించేందుకే రీటెండర్లు పిలిచినట్టు స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం నాణ్యతతో ఉండాలని, పనుల కేటాయింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు. త్వరలోనే కాంట్రాక్టర్లతో సమావేశమై, బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని తెలిపారు. ప్రతి టెండర్‌ ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నట్లు కృష్ణబాబు చెప్పారు. కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతలో ఆర్థిక అర్హతలు బేరీజు వేస్తామన్నారు. ఈ- టెండర్‌ దాఖలు చేసినా హార్డ్‌ కాపీలు ఇవ్వాలని సూచించామని తెలిపారు. సెప్టెంబర్‌తో సమయం ముగిసినా కేంద్రాన్ని మరింత గడువు కోరినట్లు కృష్ణబాబు చెప్పారు.