ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్.. 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..

ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ర్యాంకుల వారీగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు జరుగుతుందని..

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్.. 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..
Follow us

|

Updated on: Oct 17, 2020 | 3:40 PM

AP Eamcet Counselling Schedule: ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ర్యాంకుల వారీగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు జరుగుతుందని అడ్మిషన్ల కన్వీనర్ ఎం.ఎం నాయక్ తెలిపారు. అలాగే విద్యార్హత ధ్రువపత్రాలలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌లో పాల్గొనవచ్చునని..  ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే విద్యార్థి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు రిజిస్ట్రేషన్, లాగిన్ ఐడీ నెంబర్లు మెసేజ్ రూపంలో వస్తాయని.. ఆ సమాచారం అందిన తర్వాత లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అటు వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరోవైపు దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 23 నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుందన్నారు. అటు సీఏపీ (చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.