కొలువుదీరిన సీఎం జగన్ కేబినెట్

AP CM YS Jagan sets up cabinet, కొలువుదీరిన సీఎం జగన్ కేబినెట్

ఏపీలో జగన్ కేబినెట్ కొలువుదీరింది. 25మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ సమక్షంలో నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11గంటల 49 నిమిషాలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో అమాత్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జగన్ అన్ని వర్గాలకు, అన్ని జిల్లాలకు సమ న్యాయం చేస్తూ..తనకు విధేయులుగా ఉన్న వారితో పాటు సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని మంత్రి పదవులను కేటాయించారు.

శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరంతా తెలుగులో దైవసాక్షిగా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్..తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్ అమాత్యులుగా ప్రమాణం చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఆళ్ల నాని మంత్రులుగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు భాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు సుచరిత. ఇదే జిల్లా నుంచి మోపిదేవి ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోయినా ఆయనను తన కేబినెట్ లోకి తీసుకున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతం రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అదే జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ సొంత జిల్లా కడప నుంచి అంజాద్ పాషా అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరి జయరామ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు చేత గవర్నర్ నరసింహన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *