వైఎస్సార్ కంటి వెలుగు పథకం.. అనంతలో ప్రారంభించిన జగన్

CM Jagan starts Ysr Kanti Velugu Scheme, వైఎస్సార్ కంటి వెలుగు పథకం.. అనంతలో ప్రారంభించిన జగన్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ కార్యమానికి శ్రీకారం చుట్టారు జగన్. ఈ పథకం కింద ప్రజలందరికీ  ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయనున్నారు. మొత్తం 5 దశల్లో మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఈ పథకంలో భాగంగా తొలి విడతలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. ఆ తరువాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెట్టే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

కంటివెలుగు పథకాన్ని ప్రారంభించటమే కాకుండా అమలుకు సంబంధించి కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా.. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులను నియమించారు. ఇప్పటికే అన్ని పీహెచ్సీలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపారు. 42 వేల మంది ఆశావర్కర్లు, 62 వేల మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది కంటి వెలుగు పథకం అమలులో తమ వంతు బాధ్యతను నిర్వర్తించనున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *