ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి: జగన్

AP CM YS Jagan Mohan Reddy meeting on sand mining issue, ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి: జగన్

ఇసుకలో అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై సచివాలయంలో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్‌ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని జగన్ చెప్పుకొచ్చారు. ఇసుక విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఆయన వెల్లడించారు.

ఇక ఇసుక తరలింపులో ఏ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్‌ చేసుకుంటారని చెప్పారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. ఫుటేజీని మానిటరింగ్‌ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని సూచించారు. బల్క్‌ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు.

మరోవైపు అధికారులు మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకురాలేకపోతున్నామని సీఎంకు వెల్లడించారు. కేవలం 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని.. నదుల పక్కన తవ్విన ఇసుక కూడా వరదల కారణంగా కొట్టుకుపోయిందని వారు పేర్కొన్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉందని వారు సీఎంకు తెలిపారు. నూతన ఇసుక విధానం మొదలైన రోజు నుంచి.. రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక డిమాండ్‌ ఉందని. సిమెంట్‌ కొనుగోళ్ల ఆధారంగా ఇసుక డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు లేవని అధికారులు సీఎంకు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *