అప్పుడు చెన్నై.. ఇప్పుడు హైదరాబాద్.. జగన్ భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు శుక్రవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను విశ్వభూషణ్, జగన్ ఘనంగా సత్కరించారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుల వారసులను వారు సన్మానించారు. అనంతరం జగన్ రాష్ట్ర అవతరణ వేడుకలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం, […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:31 am, Sat, 2 November 19

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు శుక్రవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను విశ్వభూషణ్, జగన్ ఘనంగా సత్కరించారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుల వారసులను వారు సన్మానించారు.

అనంతరం జగన్ రాష్ట్ర అవతరణ వేడుకలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని.. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు అంటూ జగన్ మాట్లాడారు. రాష్ట్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ.. అదే స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం వైఎస్ ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎవ్వరూ ఊహించలేదని.. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల శ్రమ, పరిశ్రమ అప్పుడు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్‌లోనే మిగిలిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో ఏ రాష్ట్రం పడనంత దగా మపం పడ్డామని, అలాంటి పరిస్థితులను అధిగమించాలని రాష్ట్ర ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి.. వెనకడగు వేయకుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలించేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని.. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్ కోరారు.