కృష్ణమ్మ పరవళ్లు..అన్నదాతల ఆనందం..జగన్ ట్వీట్

AP CM Jagan Tweets water levels of Srisailam And Nagarjunasagar Dams

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యాన్ని చేరుకోనుండడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతోషం వ్యక్తంచేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున శ్రీశైలంలో 10 గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకుంటోంది. సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లను పైకెత్తారు. ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి 65,207 క్యూసెక్కులకు నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 230.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *