చంద్రబాబుపై చర్యకు జగన్ సర్కార్ రెడీ.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. దురదృష్టకరమన్న స్పీకర్

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

  • Ravi Kiran
  • Publish Date - 4:52 pm, Mon, 30 November 20
చంద్రబాబుపై చర్యకు జగన్ సర్కార్ రెడీ.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. దురదృష్టకరమన్న స్పీకర్

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏక్రగీవంగా ఆమోదించింది. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. తానెప్పుడూ ఇలాంటి దురదృష్టకరమైన పరిణామాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అన్నారు. చంద్రబాబు తీరుపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

సోమవారం ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలి రోజే వాడీవేడీగా జరిగాయి. వ్యవసాయ రంగ సమస్యలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ.. ఒక దశలో ఆవేశంతో ఊగిపోయింది. వరద సాయంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాదనలు జోరుగా సాగాయి. ప్రభుత్వ మిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్షం సభలో రెచ్చిపోయింది. స్వయంగా చంద్రబాబు పోడియంలోకి దూసుకొచ్చి బైఠాయించారు. ఈ క్రమంలో చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించారని పాలక పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో వాడకూడదని పదాలను విపక్ష నేత వాడారంటూ స్వయంగా సీఎం జగన్ తప్పు పట్టారు.

ఆ తర్వాత టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగగా.. పదమూడు మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సాయంతో బయటికి పంపించారు. బయటికి వెళ్ళిన టీడీపీ సభ్యులు చంద్రబాబు సారథ్యంలో అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. బయట ఈ ధర్నా కొనసాగుతున్న తరుణంలోనే పాలక పక్షం.. విపక్ష నేత చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై చర్యకు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.