మహారాష్ట్రలో టొమాటోలకూ వైరస్.. రైతులకు హెవీ లాస్

మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పండిస్తున్న టొమాటోలకు అంతు తెలియని వైరస్ సోకుతోంది. దీంతో ముఖ్యంగా నాసిక్, అహ్మద్ నగర్, సతారా, పూణే జిల్లాల్లో టొమాటో పంట వేసిన రైతులు లబోదిబోమంటున్నారు

మహారాష్ట్రలో టొమాటోలకూ వైరస్.. రైతులకు హెవీ లాస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 1:33 PM

మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పండిస్తున్న టొమాటోలకు అంతు తెలియని వైరస్ సోకుతోంది. దీంతో ముఖ్యంగా నాసిక్, అహ్మద్ నగర్, సతారా, పూణే జిల్లాల్లో టొమాటో పంట వేసిన రైతులు లబోదిబోమంటున్నారు. గత పది రోజుల్లో వీరు 60 నుంచి 80 శాతం పంట నష్టపోయారు. ఈ వైరస్ కారణంగా ఎర్రని టొమాటోలు రంగును కోల్పోతూ పేలగా మారి.. వాటి లోపల నల్లని రంగుతో చిన్న రంధ్రాలు ఏర్పడుతున్నాయట. ఈ వైరస్ ని రైతులు ‘తిరంగా’ వైరస్ అని అభివర్ణిస్తున్నా.. ఇది స్థానికంగా వారు వాడుతున్న పదం. మార్చి నెలలో తాను 5 ఎకరాల్లో టొమాటో పంట వేశానని, కానీ ఈ వైరస్ వల్ల పంట పూర్తిగా దెబ్బ తిన్నదని సతారా జిల్లాలోని కరడ్ అనే గ్రామ రైతు ఒకరు చెప్పారు. మొక్క నుంచి టొమాటోలను కోసిన వెంటనే 12 గంటల్లో అవి పాడైపోతున్నాయట. ఏప్రిల్ నుంచే వీటికి ఈ తెగులు సోకినప్పటికీ.. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా శాస్త్రవేత్తలు ఈ వైరస్ ఏమిటో ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏమైనా…. ఇప్పుడే దీన్ని నాశనం చేయకపోతే రాబోయే రోజుల్లో ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో టొమాటో పంటలు కూడా దెబ్బ తినవచ్ఛునని వారణాసికి చెందిన ఓ రీసెర్చర్ హెచ్చరించారు. అయితే ఇది మనుషులకు హాని చేయకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.