కర్నాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. ‘ స్వామి ‘ కి మరో దెబ్బ !

CONGRESS MLAS RESIGNED IN KARNATAKA, కర్నాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. ‘ స్వామి  ‘ కి మరో దెబ్బ !

కర్ణాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సుధాకర్, ఎంబీటీ. నాగరాజ్ రాజీనామా చేశారు. దీంతో పార్టీకి రాజీనామాలు చేసిన సభ్యుల సంఖ్య 16 కు పెరిగింది. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుధాకర్, నాగరాజ్ ఇద్దరూ బుధవారం సాయంత్రం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మరోవైపు..మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప..స్పీకర్ ను కలిసిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని, అసెంబ్లీలో బలనిరూపణకు అనుమతించాలని అభ్యర్థించారు. సభలో మేం మెజారిటీ నిరూపించుకుంటాం.. మాకా సత్తా ఉంది అని ఆయన ఆ తరువాత వ్యాఖ్యానించారు. అటు-ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కమలం పార్టీకి మద్దతు ఇఛ్చిన పక్షంలో శాసన సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 107 కు పెరుగుతుంది.ఇది కమలం పార్టీకి లాభదాయకమే. మరోవైపు… ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడకపోవడంతోను, ఇటు బెంగుళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘ డబుల్ స్టాండర్డ్స్ ‘ పాటించడంతోను ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. అవకాశం వస్తే సిఎం కుర్చీ ఎక్కేందుకు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ‘ ఛాన్స్ ‘ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా- తమ పార్టీకి చెందిన జేడీ-ఎస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు శివారు లోని రిసార్ట్ కు కుమారస్వామి తరలించినప్పటికీ.. ప్రభుత్వ పరిస్థితి ‘ ముందు నుయ్యి-వెనుక గొయ్యి- అన్న చందంగా ఉంది. ఇదే తరుణమని బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు తాను తెర చాటు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి కర్ణాటకలో రాజకీయ ‘ నాటకం ‘ ఓ పెద్ద సీరియల్ లా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *