Andhra Pradesh: గుడ్డలూడదీసి కొడతా.. నన్నుకొట్టి పొలిమేర కూడా దాటలేవు.. సాధారణంగా ఇలాంటి డైలాగ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం.. అయితే రాయలసీమలో ఓ ఎమ్మెల్యే సినిమా డైలాగ్‌లను తలదన్నేలా పంచ్ డైలాగ్‌లు పేల్చాడు. నువ్వో.. నేనో.. తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్లీనరీలో హాట్ హాట్ డైలాగ్‌లతో హీట్ పెంచారు. ఆయనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి. ధర్మవరం పాలిటిక్స్ ఎంత గరంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఈసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ప్రత్యర్థులపై మాటల దాడికి దిగారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణతో పాటు ఆయన వర్గీయులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై ఒంటికాలుపై లేచారు కేతిరెడ్డి వెంకట్రామ్‌రెడ్డి. ‘‘ఇప్పుడు బీజేపీలో ఉన్నావ్.. టీడీపీలోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటున్నావ్.. టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున కళాజ్యోతి సెంటర్లో గుడ్డులూడదీసి కొడతా’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వెంకట్రామ్‌రెడ్డి. ‘‘మీరు గెలిచినా ఓడినా అంతా అస్సాం రైలెక్కి కనిపించకుండాపోతారు. నేను ఓడినా ఇక్కడే ప్రజల మధ్య ఉంటా’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘వాళ్లు గెలిస్తే ఆరు నెలల్లో నా కాళ్లూ, చేతులు విరిచేస్తానని చెప్పారు. నన్ను కొట్టి చూడు.. పొలిమేర కూడా దాటలేరు’’ అంటూ రెచ్చిపోయారు కేతిరెడ్డి వెంకట్రామ్‌రెడ్డి. ఇదే సమయంలో తాను భూ కబ్జా చేశానని వస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు కేతిరెడ్డి వెంకట్రామ్‌రెడ్డి. రోడ్డు వేస్తే కూడా కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎక్కడ కబ్జా చేశానో చూపించాలంటూ సవాల్ విసిరారు.