మనకు అనారోగ్యంగా అనిపిస్తే ఆస్పత్రికి వెళ్తాం. డాక్టర్(Doctor) కు మన సమస్యను చెప్పుకుని, పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తాం. వైద్యులు మనను పరీక్షించి ప్రిస్క్రిప్షన్ పై వాడాల్సిన మెడిసిన్స్ వివరాలు రాసిస్తారు. వాటిని మెడికల్ షాపు నిర్వాహకులకు చూపించి, అవసరమైన మందులు తీసుకుంటాం. అయితే డాక్టర్ల రాత తీరును మాత్రం మనం అంతగా పట్టించకోం. ఒక వేళ వైద్యులు రాసిన మందుల వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించినా అవి మనకు అర్థం కాని విధంగా ఉంటాయి. అది కేవలం డాక్టర్లు, మెడికల్ షాపు నిర్వాహకులకు మాత్రమే అర్ధమవడం గమనార్హం. కొన్ని సార్లు ప్రిస్క్రిప్షన్(Priscription) పై వైద్యులు రాసిన మందుల వివరాలు మెడికల్ షాపు వాళ్లకూ అర్థం కావు. ఫలితంగా వేరే మందులు ఇవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా ఇతర మెడిసిన్స్ వాడటం ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. తాజాగా కడప జిల్లాలో(Kadapa District) ఇలాంటి ఘటనే జరిగింది. వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ అర్థం కాని ఓ మెడికల్ షాప్ వ్యక్తి.. డోస్ ఎక్కువగా ఉన్న మందులు ఇచ్చాడు. ఇవి వాడిన బాధితురాలికి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు సదరు మెడికల్ షాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప జిల్లా రాజంపేటలోని ఎర్రబల్లి ప్రాంతానికి చెందిన సుబ్బనరసమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. గతేడాది డిసెంబరులో కడపలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ సమస్య ఉందని గుర్తించారు. ఆరోగ్యం కుదుటపడేందుకు మందులు రాసిచ్చారు. వృద్ధురాలి కుమారుడు సుధాకరాచారి ఆ మందుల చీటీని తీసుకుని ఓ మెడికల్ షాపుకు వెళ్లి మెడిసిన్స్ తీసుకున్నారు. వాటిని వాడిన వృద్ధురాలికి ఆరోగ్యం కుదుటపడకపోగా.. మరింతగా క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. మరోసారి వైద్యుడిని కలిశారు. యాంటీ థైరాక్సిన్ 10 ఎంజీ రాసిస్తే, థైరాక్సిన్ సోడియం 100 ఎంజీ మందులు వాడారని తెలుసుకున్నారు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోయిందని తేల్చారు.
ఈ విషయమై.. గత నెల 24న రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఔషధ దుకాణంపై బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం మహిళను.. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 5న మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read