ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఇల్లాలు

వివాహేతరబంధం మోజులో పడి ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది...

  • Pardhasaradhi Peri
  • Publish Date - 1:12 pm, Sun, 30 August 20
ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఇల్లాలు

వివాహేతరబంధం మోజులో పడి ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఎల్లంగారి వెంకటేశ్వర్లుకు ఆరేళ్ల కిందట అశ్విని అనే యువతితో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, కొన్నాళ్లక్రితం టి.దేవరాజ్‌ అనే యువకుడి కన్ను అశ్విని పై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి స్నేహాన్ని పెంచుకుని ప్రేమ పాఠాలు నూరిపోశాడు. ఇలా ఆమెతో బాగా దగ్గరైపోయాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త వెంకటేశ్వర్లు భార్యను హెచ్చరించాడు. దీంతో నెల రోజుల క్రితం ఆమె తన ప్రియుడు దేవరాజ్‌తో ఊరినుంచి జంపైపోయింది.

తన భార్య కనపడట్లేదని పోలీసులకు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. ఇటీవల అశ్విని, దేవరాజ్ తిరిగి ఊరికి వచ్చారు. వెంకటేశ్వర్లు తన భార్య అశ్వినితో గొడవపడి ఆమెను వెంటబెట్టుకుని దేవరాజ్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ ముగ్గురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రియుడు దేవరాజ్‌తో కలిసి అశ్విని.. వెంకటేశ్వర్లుపై దాడి చేయటంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మళ్లీ దేవరాజుతో అశ్విని ఊరి నుంచి పరారైపోయింది. చిన్నారులిద్దరూ అనాధలుగా మిగిలారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.