AP Rains: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు.. అత్యవసర సాయం కోసం నంబర్స్ ఇవే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. వాయుగుండంగా మారింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వాన ముప్పు పొంచి ఉంది. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనల చేసింది.

AP Rains: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు.. అత్యవసర సాయం కోసం నంబర్స్ ఇవే
Weather Report
Follow us

|

Updated on: Nov 20, 2022 | 7:28 PM

వానాకాలం ముగిసినా వర్షాలు మాత్రం తగ్గడం లేదు. వాయుగుండంగా మారిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు అటు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. నైరుతి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇది జాఫ్నా (శ్రీలంక)కి తూర్పున 600 కి.మీ., తూర్పు ఆగ్నేయంగా కారైకాల్‌కు 630 కి.మీ., చెన్నైకి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. నెమ్మదిగా వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు సన్నద్ధం కావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాన కురిసేటప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని హెచ్చరించారు. కరెంట్ పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. కాలవలు, చెరువుల ఉధృతిని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే 1070, 18004250101, 08632377118 నెంబర్లను సంప్రదించాలన్నారు.

వానలతో అల్లాడుతున్న తమిళనాడు

వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు వణికిపోతుంది. ఇప్పటికే తమినాడును వరుణుడు వదలడం లేదు. 15రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కుండపోత వానలు, వరదల బీభత్సం నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇంతలోనే మళ్లీ రెయిన్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికీ పలు జిల్లాల్లో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. నీరు తప్ప నేల కనిపించడం లేదు. ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పంటలు నీట మునిగాయి. నిత్యావసరాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో నానా అవస్తలు పడుతున్నారు. మూడు జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. రాశిపురం, సేలం, ఈరోడ్‌ జిల్లాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కావేరీ నదికి ఎగువ నుంచి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..